Begin typing your search above and press return to search.

రైతును కొట్టే ఫోటోతో రాహుల్ రచ్చ.. వీడియో బీజేపీ షాక్

By:  Tupaki Desk   |   29 Nov 2020 12:20 PM IST
రైతును కొట్టే ఫోటోతో రాహుల్ రచ్చ.. వీడియో బీజేపీ షాక్
X
కంటికి కనిపించేవి కూడా నిజాలు కావన్న పాడు రోజులు ఇప్పుడు వచ్చేశాయి. తెల్లనివన్నీ పాలు.. నల్లనివిన్నీ నీళ్లు కావన్న పాత సామెతకు కొనసాగింపుగా.. కంటిని నమ్మేలా చేసే ఫోటోల్లో నిజం ఉండదు.. వీడియోల్ని చూశాకే నిజం ఏదో తేల్చుకోవాలన్నట్లుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రైతాంగ సమస్యల మీద గళం విప్పిన అన్నదాతలు.. దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించటం తెలిసిందే. ఢిల్లీ రోడ్ల మీద వారు చేస్తున్న నిరసనతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

మోడీ సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ వెంట వంటసామాగ్రిని తీసుకొచ్చిన వారు.. అవసరమైతే రెండు నెలల పాటు ఢిల్లీలో ఉండేలా ప్లాన్ చేసుకురావటం గమనార్హం. ఊహించని పరిణామంతో మోడీ ప్రభుత్వం ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో ఒక వృద్ధ రైతుపై పోలీసులు లాఠీ ఎత్తిన ఫోటోను పోస్టు చేశారు. ఇది సంచలనంగా మారటమే కాదు.. వైరల్ అయ్యింది.

‘జై జవాన్.. జై కిసాన్’ అన్నది మన నినాదమని.. కానీ ఈ రోజు మోడీ అహంకారం వల్ల జవాను కాస్తా రైతుకు వ్యతిరేకంగా నిలబడ్డాడని.. ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ఫోటోను ప్రియాంక గాంధీ కూడా షేర్ చేశారు. పోలీసుల తీరును ఆమె తప్పు పట్టారు. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేస్తున్న మోడీ సర్కారు.. అన్నదాతలపై ఇలా లాఠీ ఎత్తటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఈ ఫోటోతో మొదలైన రాజకీయ రగడకు ఫుల్ స్టాప్ పెట్టేలా బీజేపీ ఒక వీడియోను కౌంటర్ గా పోస్టు చేసింది.

అందులో సదరు వృద్ధరైతుపై పోలీసులు లాఠీ ఎత్తటం.. గాలిలో ఊపి భయపెట్టే ప్రయత్నం చేశారే తప్పించి.. ఎక్కడా లాఠీ రైతును టచ్ చేయలేదు. అపఖ్యాతి పాలైన నాయకుడిగా రాహుల్ ను అభివర్ణించిన బీజేపీ.. అసలు వీడియో ఇది.. నిజాన్ని చూడాలంటూ షేర్ చేశారు. దీంతో.. అప్పటివరకు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఫోటో విలువ పడిపోవటమే కాదు.. ఇలాంటి తప్పుడు ఫోటోలు పోస్టు చేయటం ఏమిటి?అంటూరాహుల్ ను తప్పు పడుతున్నారు. మొత్తంగా ఫోటో ఏమో కానీ.. కాంగ్రెస్ ముఖ్యనేత గాలీ పోయిందని చెప్పక తప్పదు. ఈ ఫోటో - వీడియో చూశాక.. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావన్న వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది.