Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ 120 గెలిస్తే రాహులే ప్రధానమంత్రి.. లెక్క ఇదే

By:  Tupaki Desk   |   6 Dec 2021 2:28 PM IST
కాంగ్రెస్ 120 గెలిస్తే రాహులే ప్రధానమంత్రి.. లెక్క ఇదే
X
లోక్ సభకు జరిగే ఎన్నికలకు.. రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మధ్య వ్యత్యాసం ఉంటుందా? అంటే.. గతంలో ఉండదనే మాట వినిపించేది. కానీ.. 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్ని చూసినప్పుడు ఒక విలక్షణమైన సీన్ ఒకటి స్పష్టంగా కనిపించింది.

రాష్ట్రాల సెంటిమెంట్లు ఏ విధంగా అయితే ఎన్నికల్లో వర్కువుట్ అవుతాయో.. అదే రీతిలో జాతీయ రాజకీయాలకు సంబంధించిన సెంటిమెంట్ లోక్ సభ ఎన్నికల్లో వర్కువుట్ అవుతుందన్న విషయాన్ని 2019 ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒక ఆసక్తికర వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

గడిచిన రెండు టర్మ్ లో దారుణ ఓటమిని చవి చూసిన కాంగ్రెస్.. 2024 ఎన్నికల్లో 120 సీట్లు గెలిస్తే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం ఉందన్న వాదనకు బలం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

2004 నుంచి 20014 వరకు బలహీనమైన ప్రధానమంత్రిని చూసిన దేశ ప్రజలు.. ఒక బలమైన నేత పీఎం కుర్చీలో కూర్చుంటే బాగుంటుందన్న తపన పెరిగింది.

దీనికి తగ్గట్లే హిందుత్వ ఎజెండాతో పాటు..తన పదునైన ప్రసంగాలతో.. గుజరాత్ డెవలప్ మెంట్ ను మోడల్ గా చూపించిన మోడీ.. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్.. డీజిల్ ధరల్ని లీటరకు రూ.50కు తీసుకురావటమే కాదు.. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి.. జాతి జనుల బ్యాంకు ఖాతాల్లో వేస్తారన్న ప్రచారం ఎన్నికల మేనిఫేస్టో మాదిరి మారింది. నిజానికి ఈ రెండు అంశాలపై బీజేపీ నేరుగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. కానీ.. ప్రజలు ఆ మైండ్ సెట్ లోకి వెళ్లేలా సాగిన సోషల్ మీడియా ప్రచారం ఓటరును బలంగా ప్రభావితం చేసింది.

మోడీ లాంటి బలమైన నేత ప్రధాని అయితే.. దేశంలో మరో స్థాయికి చేరుతుందన్న వాదనకు బలం చేకూరింది. అందుకు తగ్గట్లే.. తమ మనో వాంఛను తీర్చుకున్న దేశ ప్రజలకు నరేంద్ర మోడీ రూపంలో అత్యంత శక్తివంతమైన నేత దేశ ప్రధాని కావటం.. ఆయన పాలనను గడిచిన ఏడున్నరేళ్లుగా చూడటం తెలిసిందే. బలహీన ప్రధాని.. రిమోట్ కు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకునే ప్రధాని పాలనలో దేశం ఎలా ఉంది? తిరుగులేని ప్రజాబలంతో పాటు.. శక్తివంతమైన ప్రధాని అధ్యర్యంలో పాలన ఎలా ఉంటుందన్న విషయంపై ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

తనకు లభించిన అమూల్యమైన అవకాశాన్ని మోడీ తన మొండితనంతో జార విడుచుకుంటున్నారనిచెప్పాలి. ఆయన హిందుత్వ ఫార్ములా ఇప్పటికి సక్సెస్ మంత్రగా మారినప్పటికీ.. పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు.. రాష్ట్రాల్నిబలహీనంగా మార్చటం.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాల్ని మార్చుకునే విషయంలోఆయన ప్రదర్శించే మొండితనం ప్రజలకు ఆయన మీద ఆగ్రహాన్ని కలిగించేలా చేస్తున్నాయి.

ఆయన్ను ప్రేమించి.. అభిమానించి.. ఆరాధించే వారు.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే.. దేశద్రోహులు అనే వరకు వెళ్లిన వైనాన్ని చూస్తే.. తెలంగాణ ఉద్యమం వేళలో సెంటిమెంట్ కు భిన్నంగా మాట్లాడిన ఎవరైనా సరే.. తెలంగాణ ద్రోహులు అన్న ముద్ర వేసిన చందం గుర్తుకు వస్తుంది.

ఉద్యమం కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. ఒక అంశంపై భిన్నాభిప్రాయాలు తెర మీదకు రావటం.. వాటి మీద చర్చ జరగటం ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. అందుకు భిన్నంగా మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే శాసనంలా వ్యవహరిస్తే.. ఒక రోజు కాకున్నా మరో రోజుకైనా ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పదు. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని.. తీవ్ర వ్యతిరేకతల్ని పరిగణలోకి తీసుకోకుండా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేసే విషయంలో మోడీ సర్కారు ఏం చేసిందన్నది తెలిసిందే.

మొదట్లో ఎంత మొండిగా వ్యవహరించిన వారు.. చివరకు జాతి ప్రజలకు క్షమాపణలు చెప్పి.. చేసిన మూడు చట్టాల్ని వెనక్కి తీసుకురాక తప్పని పరిస్థితి.ఏడున్నరేళ్లుగా మోడీ తీరు చూసిన వారికి.. ఆయన ప్రభుత్వం వ్యవహరించిన వైఖరి అందుకు భిన్నంగా ఉండటమే కాదు.. తొలిసారి తలొగ్గిన తీరు చూస్తే.. వచ్చే ఏడాదిలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలు మోడీ చేత ఇలాంటి నిర్ణయాన్ని తీసుకునేలా చేశాయన్నది నిజం. ఇప్పటివరకు మోడీ సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న చర్చకు.. చట్టాల్ని వెనక్కి తీసుకోవటం ద్వారా.. ఆ వాదనలో పస ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లైంది. ఈ పరిణామం.. మోడీ రాజకీయ ప్రత్యర్థులకు నైతిక బలాన్ని ఇవ్వటమే కాదు.. మరో రెండున్నరేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సమాయుత్తం కావాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది.

ఓవైపు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న అధికారపక్షాల్ని ఒక జట్టుగా చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ తాము లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇలాంటివేళలోనే.. కాంగ్రెస్ కు కనీసం 120 సీట్లు వస్తే.. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అవుతారన్న ప్రచారం బలంగా సాగుతోంది అదెలా అంటే.. దానికి సంబంధించిన లెక్కల్ని వినిపిస్తున్నారు.

లోక్ సభలో మొత్తం 543 స్థానాలు ఉంటే.. అందులో 524 స్థానాలు రాష్ట్రాల్లో ఉంటే.. మరో 19 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రాల్లో అత్యధిక సీట్ల వాటా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. మొత్తం లోక్ సభ స్థానాల్లో 15.3 శాతం అంటే.. 80 స్థానాలు యూపీ కింద ఉన్నాయి. తర్వాతి స్థానా్లో మహారాష్ట్ర (48), పశ్చిమబెంగాల్ (41), బిహార్ (40), తమిళనాడు (39) స్థానాలు ఉన్నాయి. దేశంలోని మొత్తం రాష్ట్రాల కంటే కూడా ఐదు రాష్ట్రాల్లో 248 స్థానాలు ఉన్నాయి. అంటే.. 50 శాతానికి పైగా సీట్లు ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

ఇందులో యూపీలో బీజేపీ బలంగా ఉన్నా.. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఏ పార్టీ బలం ఎంతన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. పశ్చిమ బెంగాల్ లో దీదీకి తిరుగులేని అధిక్యత ఉందన్న విషయం ఇటీవల జరిగిన ఎన్నికలు స్పష్టం చేశాయి. తమిళనాడులో ఇప్పుడు నడుస్తున్న స్టాలిన్ హవా నేపథ్యంలో ఆ పార్టీకి అక్కడ తిరుగులేదు. బిహార్ లో బీజేపీ మిత్రపక్షం అధికారంలో ఉన్నప్పటికీ.. లాలూప్రసాద్ తో కలిసి కాంగ్రెస్ బరిలో దిగితే.. ఫలితాలు భిన్నంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు.. ఆ పార్టీకి కాస్తోకూస్తో పట్టు ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే.. ఛత్తీస్ గఢ్.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. కర్ణాటక.. కేరళ.. పంజాబ్.. ఉత్తరాఖండ్ లు ఉన్నాయి. మిత్రులతో కలిసి ప్రభావాన్ని చూపించే రాష్ట్రాల విషయానికి వస్తే.. బిహార్.. మహారాష్ట్రలు ఉన్నాయి. గుజరాత్ లోనూ ఈసారి ప్రభావితం చేపిస్తుందన్న అంచనాలు ఉన్నా.. అదేమంత తేలికైన విషయం కాదని చెప్పాలి. తనకు బలమున్న రాష్ట్రాల్లో 120 స్థానాలు సొంతం చేసుకోగలిగితే.. బీజేపీ బలం 180కు (ప్రస్తుతం 301స్థానాల బలముంది) తగ్గిపోతుంది.
180 స్థానాలు గెలుపొందినప్పటికీ.. అధికారానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 272 అవసరమైన దాదాపు వంద సీట్ల తేడా ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రుల్ని దూరం చేసుకున్న బీజేపీకి ఉన్న వారితో కలిగే ప్రయోజనం చాలా తక్కువ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న తపనతో ఉన్న విపక్షాలు.. వంద సీట్లు ఉన్న కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పజెప్పేందుకు సిద్ధపడతారు. బీజేపీతో పోలిస్తే.. కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో ఎలా ఉంటుందన్న విషయంలో యూపీఏ 1, 2 టర్మ్ లో చూసిన పార్టీలు బీజేపీతో కంటే కాంగ్రెస్ వెంట నడిచే వీలుంది. అదే జరిగితే.. కాబోయే ప్రధానిగా రాహుల్ కు మార్గం సుగమం అయినట్లే. అయితే.. ఈ వాదన మొత్తం వచ్చే ఏడాది మొదట్లో జరిగే నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరింత క్లారిటీ వచ్చే వీలుందని చెప్పక తప్పదు.