Begin typing your search above and press return to search.

కేటీఆర్ దగ్గర పంచాయతీ పెట్టిన రాహుల్ సిప్లిగంజ్!

By:  Tupaki Desk   |   6 March 2020 1:42 PM GMT
కేటీఆర్ దగ్గర పంచాయతీ పెట్టిన రాహుల్ సిప్లిగంజ్!
X
హైదరాబాద్ లోని ఓ పబ్ లో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కావాలనే రాహుల్ఈ గర్ల్ ఫ్రెండ్ ను కొందరు యువకులు టీజ్ చేయడంతో....రాహుల్ వారితో గొడవపడినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే రాహుల్ పై ఆ యువకులు దాడి చేశారని తెలుస్తోంది. పబ్ లో రాహుల్ ను కొడుతున్న దృశ్యాల వీడియో వైరల్ అయింది. ఈ దాడి ఘటనలో ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రాహుల్....తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కు రాహుల్ ట్వీట్ చేశాడు. తనను పబ్ లో కొడుతున్న వీడియోను ట్వీట్ చేసిన రాహుల్ ....ఈ దాడి ఘటనపై సరైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ను కోరాడు. అంతేకాదు, ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలని, తన వైపు నుంచి ఎలాంటి తప్పు ఉందని తేలినా కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశాడు. తాము నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు...ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని అన్నాడు. తన లాంటి సామాన్యులు ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకోవాలని రాహుల్ ట్వీట్ చేశాడు.

ఆ గ్యాంగ్ తనను ఎలా రెచ్చగొట్టిందో చూడాలని, ఈ వీడియోను చూసి తప్పెవరిదో నిర్దారించి నిజం వైపు నిలబడాలని కేటీఆర్ ను రాహుల్ కోరాడు. తాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డనని, తెలంగాణ కోసమే తుదిశ్వాస వరకు బతుకుతానని రాహుల్ అన్నాడు. తాను ఎప్పుడూ టీఆర్‌ఎస్ పార్టీ కోసమే నిలబడ్డానని, తాను టీఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేశానని అన్నాడు. నాయకుల మీద నమ్మకంతో ఎన్నుకుంటామని, కానీ వారు అధికారాన్ని దుర్వినయోగపరచకూడదని రాహుల్ ట్వీట్ చేశాడు. తన అన్న ఎమ్మెల్యే అనే అండతో, ధైర్యంతో కొందరు ప్రజలతో తప్పుగా ప్రవర్తిస్తూ.. కొడుతున్నారని....దీన్ని ఆపాలని కోరాడు.

దయచేసి ఈ కేసును కేటీఆర్ పర్యవేక్షించాలని, తనదే తప్పని తేలితే శిక్షించాలని రాహుల్ అన్నాడు. తనకు నిష్ఫక్షపాతమైన న్యాయం కావాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అన్యాయాలు చేసేవారికి అడ్డుకట్ట వేసేందుకు ఇదే సరైన సమయం అని రాహుల్ అన్నాడు. మీరు న్యాయం చేస్తారని నమ్ముతున్నా సర్ అంటూ రాహుల్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

అయితే, రాహుల్ పై దాడికి కారణాలు వేరే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పాత కక్షల నేపథ్యంలోనే సిప్లిగంజ్ పై పథకం ప్రకారం దాడి జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ ప్రోగ్రామ్ కోసం డబ్బులు తీసుకున్న రాహుల్...ఆ ప్రోగ్రామ్‌ను చేయలేకపోయాడు. దీంతో, రాహుల్ తీరుపై గుర్రుగా ఉన్న సదరు యువకులు గతంలో రాహుల్ తో ఇదే పబ్ లో గొడవపడ్డారిన తెలుస్తోంది. సమయం కోసం వెయిట్ చేసిన ఆ యువకులు....రాహుల్ తన గర్ల్ ఫ్రెండ్‌ తో కలిసి పబ్ కు రావడంతో ఆ అమ్మాయిని టీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి రాహుల్‌ పై బీర్ బాటిల్‌తో దాడి జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇక, మరి, రాహుల్ ట్వీట్ పై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.