Begin typing your search above and press return to search.

పీఎం కేర్స్ ఫండ్ రహస్యం బయటకు లాగిన రాహుల్

By:  Tupaki Desk   |   8 Feb 2022 2:30 PM GMT
పీఎం కేర్స్ ఫండ్ రహస్యం బయటకు లాగిన రాహుల్
X
కరోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న స‌మ‌యంలో ‘పీఎం కేర్స్‌ (PM CARES)’ పేరుతో అత్యవసర సహాయ నిధిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నిధులు, ఖ‌ర్చులు విష‌యం ప్ర‌తిసారి చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. తాజాగా మ‌ళ్లీ ఈ నిధులు వార్త‌ల్లోకి ఎక్కింది. పీఎం కేర్స్ ఫండ్‌కు మొత్తం రూ.10,990 కోట్ల నిధులు రాగా... ఇందులో కేవలం రూ.3,976 కోట్లు మాత్రమే(36శాతం) ఖర్చు చేశారు. 2021 మార్చి 31 నాటికి ఉన్న వివ‌రాలు ఇవి అని కేంద్రం తాజాగా వెల్ల‌డించింది.

క‌రోనా వల్ల నెలకొన్ని పరిస్థితులు ఎదుర్కునేందుకు లేదా ఏమైనా ఎమర్జెనీ పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అధిగమించడమే లక్ష్యంగా ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ ( పీఎం కేర్స్ ఫండ్) పేరుతో జాతీయ నిధిని ఏర్పాటు చేశారు. పీఎం కేర్స్‌ కింద ఆన్‌లైన్‌లో, చెక్కులు, డీడీలు, నగదు రూపంలో విరాళాల సేకరించారు.

ఈ విరాళాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు అని ఆడిట్ రిపోర్టు వెల్ల‌డించింది. ఈ మొత్తాల‌ను క‌రోనాకు సంబంధించిన అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

అయితే, తాజాగా అడిట్ రిపోర్టులో పీఎం కేర్స్ ఫండ్‌కు వ‌చ్చిన నిధులు , చేసిన ఖ‌ర్చుల గురించి కేంద్రం వెల్ల‌డించింది. 2021 మార్చి 31 నాటికి పీఎం కేర్స్‌ ఫండ్‌ కు మొత్తం రూ.10,990 కోట్ల నిధులు వ‌చ్చాయ‌ని కేంద్రం తెలిపింది. రూ.3,976 కోట్లు క‌రోనాకు సంబంధించిన వివిధ కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు.వలస కార్మికుల సంక్షేమం కోసం రూ. 1000 కోట్లు , 6.6 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల కొనుగోలు కోసం రూ.1,392 కోట్లు , మేడిన్ ఇండియా వెంటిలేటర్ల కోసం రూ.1,311 కోట్లు , ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.201.58 కోట్లు , 500 పడకల కొవిడ్ ఆస్పత్రులు ముజఫర్ పుర్, పాట్నాలలో ఏర్పాటు కోసం రూ.50 కోట్లు , రూ.20.4 కోట్లు తొమ్మిది రాష్ట్రాల్లో 16 ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు, కొవిడ్ టీకాలపై పనిచేస్తున్న ల్యాబ్ ల అప్ గ్రేడేషన్ మ‌రియు బ్యాంకు ఛార్జీలకు మిగ‌తా మొత్తం ఖర్చు అయినట్లు ఆడిట్ రిపోర్ట్ తెలిపింది.

కాగా, పీఎం కేర్స్‌ నిధుల విష‌యంలో తాజాగా వెల్ల‌డైన స‌మాచారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పీఎం కేర్స్ నిధుల విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి అబ‌ద్దం ఆడుతున్నార‌ని ఆక్షేపించారు. ఈ మేర‌కు ఆయ‌నో ట్వీట్ చేశారు. ప‌లువురు నెటిజ‌న్లు ఈ ట్వీట్‌కు స్పందిస్తూ పీఎం కేర్స్ నిధుల విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త లోపించిందని, పైగా కేంద్రం చేస్తుంది ఒక‌టి చెప్తొంది మ‌రొక‌టి అని కామెంట్ చేశారు.