Begin typing your search above and press return to search.

రాహుల్ పాదం మోపరంతే : ఆంధ్రాలో ఏమున్నది కనుక...?

By:  Tupaki Desk   |   15 July 2022 10:30 AM GMT
రాహుల్ పాదం మోపరంతే : ఆంధ్రాలో ఏమున్నది కనుక...?
X
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తొందరలో అంటే ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు నుంచి భారీ పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించిన సంగతి విధితమే. దానికి భారత్ జోడో యాత అని పేరు పెట్టారు. ఈ భారీ యాత్ర దేశవ్యాప్తంగా 148 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా దేశంలోని పన్నెండు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను రాహుల్ పాదం టచ్ చేస్తుంది.

అయితే ఈ యాత్రలో గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఆంధ్రాను కనీసంగా కూడా రాహుల్ గాంధీ టచ్ చేయకపోవడం. పొరుగు రాష్టం తెలంగాణాలో రాహుల్ యాత్ర ఉంటుంది కానీ ఏపీ వరకూ అది రాదు అని తెలుస్తున్న విషయం. ఏపీలో ఇప్పటికే రెండు ఎన్నికల తరువాత కాంగ్రెస్ కి సమాధి కట్టేశారు. నేతలు చూసినా కూడా సైలెంట్ అయ్యారు.

ఉన్నవారే పుంజీడు మంది. వారిలో కూడా ఎవరూ యాక్టివ్ గా లేరు. ఏపీలో కాంగ్రెస్ ఫ్యూచర్ చూస్తే భయంకరంగానే ఉంది. దంతో ఎవరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా పెద్దగా చేయడం లేదు. నిజానికి కాంగ్రెస్ కంటే బలం తక్కువ ఉన్న బీజేపీ ఏపీలో హడావుడి చేస్తోంది. అయితే దానికి కేంద్రంలో బలం ఉంది. అలా బీజేపీతో అంటకాగే ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి.

దాంతో బీజేపీ రాజకీయం రంజుగా సాగుతోంది. కానీ కాంగ్రెస్ కి అంతా కాని కాలమే అయింది. దాంతోనే ఆ పార్టీ పూర్తిగా నిశ్శబ్దంతోనే గడుపుతోంది. ఈ నేపధ్యంలో ఏమీ కాని చోట ఎండమావి లాంటి చోట రాహుల్ పాదం మోపినా జరిగేది ఏముంది ఒరిగేది ఏముంది అని భావించారో ఏమో కానీ ఆయన ఈ వైపుగా తొంగి కూడా చూడడంలేదు అంటున్నారు.

ఇక తెలంగాణాలో చూస్తే ఆశలు సజీవంగా ఉన్నాయి. కాంగ్రెస్ గత రెండు ఎన్నికల్లో ఓడినా బాగానే ఓట్లూ సీట్లూ తెచ్చుకుంది, ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం కూడా అందరిలోనూ ఉంది. దాంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరీ రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణాలో ఉండేలా రూట్ మ్యాప్ డిజైన్ చేయించారు అని అంటున్నారు.

దాంతో రాహుల్ గాంధీ "భారత్ జోడో" పేరుతో అక్టోబర్ 2 నుండి ప్రారంభించే ప్రతిపాదిత యాత్ర తెలంగాణ మీదుగా సాగుతుంది. ఈ యాత్ర కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని మక్తల్‌లో తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, నిజామాబాద్ జిల్లా జుక్కల్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్‌లోకి ప్రవేశించే ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల గుండా యాత్ర సాగుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

అలాగే రాహుల్ పాదయాత్రకు టీపీసీసీ అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండంగా విజయవంతం చేస్తుందని రేవంత్ అన్నారు. ఈ యాత్రలో పార్టీతో పాటు అన్ని అనుబంధ సంస్థల ప్రజాప్రతినిధులందరినీ కలుపుతామని ఆయన పేర్కొంటున్నారు. ఇక బిజెపి విభజన రాజకీయాలను వ్యతిరేకిస్తూనే, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఈ యాత్ర బట్టబయలు చేస్తుందని రేవంత్ చెప్పడం విశేషం.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 148 రోజుల పాటు సాగుతుంది, ఇది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగనుంది. తిరోజు రాహుల్ 25 కి.మీ పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్రలో భాగంగా ర్యాలీలు బహిరంగ సభలు ఉంటాయి ఇక రాహుల్ తో పాటు కొంత దూరం సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రాతో సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొంటారు, తమ పాదాలు కదుపుతారు.

సరే ఇవన్నీ చెప్పుకున్నా ప్రతిష్టాత్మకమైన రాహుల్ గాంధీ పాదయాత్ర ఏపీని తాకకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయంగానే అంతా చూస్తున్నారు. ఏపీ మీద కాంగ్రెస్ కి కూడా ఏ రకమైన ఆశలు ఆకాంక్షలు ఇప్పటికైతే లేవు అనే ఇలా చేశారు అని అంటున్నారు. మొత్తానికి రాహుల్ పాదం మోపని ఏపీలోని కాంగ్రెస్ అహల్య మాదిరిగా రాయిలాగా ఉండిపోవాల్సిందేనా. దీనికి కాలమే జవాబు చెప్పాలి.