Begin typing your search above and press return to search.

రాహుల్ గాలి తీసే రిపోర్ట్ బయటకు తీశారుగా?

By:  Tupaki Desk   |   9 Nov 2019 8:27 PM IST
రాహుల్ గాలి తీసే రిపోర్ట్ బయటకు తీశారుగా?
X
తాము తీసుకునే నిర్ణయానికి సంబంధించి ప్రత్యర్థికి ఏ మాత్రం ఇమేజ్ రాకూడదన్నట్లుగా మోడీ టీం ప్లానింగ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకటి తర్వాత ఒకటిగా.. చాలా సునిశిత అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకొని వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో.. తాజాగా మోడీ సర్కారు అడుగులు కూడా అలానే పడుతున్నాయని చెప్పాలి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా అండ్ కోకు ఏళ్లకు ఏళ్లు రక్షణ కల్పిస్తున్న ఎస్పీజీ సెక్యురిటీ ఛట్రం నుంచి బయటకు తీసుకొస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థిపై తీసుకున్న ఈ చర్య కేంద్రప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బ తీయటమే కాదు గాంధీ ఫ్యామిలీ మీద సానుభూతి కలిగేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి తోడు.. గాంధీ ఫ్యామిలీ సైతం హుందాగా వ్యవహరించి.. తమకు ఇన్నాళ్లుగా భద్రత కల్పించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే.

కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో గాంధీ ఫ్యామిలీ సక్సెస్ అయ్యిందన్న భావన వ్యక్తమవుతున్న వేళ.. మోడీ సర్కారు మాస్టర్ స్ట్రోక్ ఒకటి కొట్టింది. 1991 నుంచి ఇప్పటివరకూ ఎస్పీజీ భద్రత వలయంలో ఉన్న గాంధీ ఫ్యామిలీ.. ఆ సంస్థ నియమాల్ని ఎంతలా ఉల్లంఘించారన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఒక నివేదికను విడుదల చేశారు.

ఇందులో సోనియా.. ప్రియాంక.. రాహుల్ ముగ్గురూ ఎస్పీజీ నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా వెల్లడించారు. 1991 నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉంటే.. వారు భద్రతా సిబ్బందికి ఏ మాత్రం సహకరించలేదన్నారు. 2015 నుంచి 2019 వరకు రాహుల్ 1892 సార్లు నియమాల్ని ఉల్లంఘించినట్లుగా తేల్చారు.

అంటే.. సరాసరిన రోజుకు ఒకసారి నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా తేల్చారు. బుల్లెట్ రెసిస్టెంట్ వాహనాన్ని తిరస్కరించి ఢిల్లీలో తిరగటం.. 250 సార్లు నాన్ బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ఢిల్లీ బయట ప్రయాణించినట్లు తేల్చారు. ఫారిన్ టూర్ల సందర్భంలోనూ రాహుల్ నిబంధనల్ని ఫాలో కాలేదన్నారు.

1991 నుంచి రాహుల్ 156సార్లు ఫారిన్ టూర్లకు వెళితే.. అందులో 143 సార్లు ఎస్పీజీ అధికారులు లేకుండా వెళ్లినట్లు తేల్చారు. రాహుల్ గాంధీతో పాటు ఆమె తల్లి సోనియా.. సోదరి ప్రియాంక గాంధీల ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా చెప్పారు. ఇదంతా చూసినప్పుడు ఎస్పీజీ మీద గాంధీ ఫ్యామిలీ ప్రదర్శించిన ప్రేమాభిమానాల డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పక తప్పదు.