Begin typing your search above and press return to search.

రాహుల్ జాకెట్ పై బీజేపీ విమ‌ర్శ‌లు!

By:  Tupaki Desk   |   31 Jan 2018 11:11 AM GMT
రాహుల్ జాకెట్ పై బీజేపీ విమ‌ర్శ‌లు!
X
విమానంలో తోటి ప్రయాణికుల సామాన్లను క్యాబిన్ లో పెట్టిన ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. యువ‌రాజు రాహుల్..... ఢిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న విమానంలో లగేజ్ సర్దుతుండగా కొంద‌రు ప్ర‌యాణికులు సెల్ఫీలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో రాహుల్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆ ఘ‌ట‌న జ‌రిగి 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే....రాహుల్ వేసుకున్న కోటుపై బీజేపీ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించింది. మేఘాలయ ఎన్నికల ప్రచారం సంద‌ర్భంగా మంగళవారం షిల్లాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి రాహుల్....రూ.70 వేల ఖరీదైన జాకెట్‌ ధరించి రావ‌డంతో బీజేపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. బీజేపీ మేఘాలయ విభాగం ట్విటర్ ఖాతాలో రాహుల్ పై విమర్శనాస్త్రాలు సంధించింది.

2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో భేటీ అయిన‌న మోదీ రూ. 11 లక్షల ఖరీదైన సూట్‌ ధరించ‌డంపై కాంగ్రెస్ , ప్రతిపక్షాలు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆ సూట్ వేలం వేయ‌గా రూ. 4.31 కోట్లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో మోదీది....`సూటు బాటు సర్కారు’ అంటూ రాహుల్ కామెంట్స్ చేశారు. దానికి బ‌దులుగా రాహుల్ ధ‌రించిన ఖ‌రీదైన జాకెట్ పై బీజేపీ రిటార్ట్ ఇచ్చింది. మేఘాలయ ప్రజల గురించి పట్టించుకోకుండా, రాష్ట్రంలో ఉన్న అసమర్థ సర్కారుకు వంతపాడతారా అంటూ ట్వీట్ చేసింది. రాహుల్‌ పక్షపాతం మేఘాలయ ప్రజలను వెక్కిరించేలా ఉంద‌ని ట్వీట్ చేసింది. అందుకే రాహుల్ రూ.70 వేల రూపాయల ఖరీదైన‌ లగ్జరీ జాకెట్‌ ధరించారని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. మేఘాలయలోని 60 అసెంబ్లీ స్థానాల‌తోపాటు, నాగాలాండ్ లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగబోతోన్న సంగ‌తి తెలిసిందే.