Begin typing your search above and press return to search.

మీడియాకెక్కితే వేటే..రాహుల్ వార్నింగ్..

By:  Tupaki Desk   |   15 Sept 2018 4:24 PM IST
మీడియాకెక్కితే వేటే..రాహుల్ వార్నింగ్..
X
కాంగ్రెస్ వార్ రూమ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాయలంలో గల వార్ రూమ్ లో సమాలోచనలు జరిపారు. తెలంగాణకు చెందిన 38మంది ముఖ్య నేతలతో రాహుల్ శుక్రవారం విడివిడిగా సమావేశమయ్యారు. మూడు గంటల పాటు వారి నుంచి అభిప్రాయాలు - సూచనలను విన్నారు. సమస్యలు - పార్టీ బలాబలాలు - అభ్యర్థుల ఎంపికలపై నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని. ఈసారి గెలిచే అవకాశాలున్నాయని పట్టు వీడవద్దని కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ హితబోధ చేశారు. టికెట్ల కోసం.. ఇతర విషయాలపై పార్టీకి నష్టం కలిగించే విధంగా ఇష్టారీతిగా మీడియా ముందుకు వెళ్లవద్దని నేతలను హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే నాతోకానీ - పీసీపీ చీఫ్ తో కానీ మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎవరికి వారు ప్రకటనలు ఇవ్వవద్దని స్పష్టంగా చెప్పారు. హద్దు మీరి మాట్లాడినా.. క్రమశిక్షణ ఉల్లంఘించినా ఎంతటి పెద్ద నేతలైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

తెలంగాణ వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో ఒక్కో సభ చొప్పున 10 సభల్లో రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొనాలని నాయకులు కోరగా రాహుల్ అంగీకరించారు. హైదరాబాద్ లో సోనియా గాంధీ పాల్గొనేలా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు.

గడిచిన సారి తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని.. ఈసారి మాత్రం పరిస్థితి పునరావృతం కావద్దని రాహుల్ గాంధీ నేతలను హెచ్చరించారు. గెలుపే లక్ష్యంగా ముందుకుపోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. అభిప్రాయబేధాలు - గొడవలు పక్కనపెట్టాలని వర్గ పోరును ప్రోత్సహించి పార్టీ గెలుపు అవకాశాలను గండికొట్టవద్దని నేతలకు రాహుల్ హెచ్చరించారు.

ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పొత్తు అవసరం చాలా ఉందని.. అందుకే కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేయాలని రాహుల్ సూచించారు. గెలిచే స్థానాలను వదులుకోవద్దని.. పొత్తులపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు నియోజకవర్గ నేతలు లేని చోట్ల.. ఇతర పార్టీల బలమైన నేతలున్న స్థానాలనే మిత్రపక్షాలకు కేటాయించాలని సూచించారు. ఇక సమావేశంలో కాంగ్రెస్ నేతలందరూ రాహుల్ కు పార్టీ బలోపేతంపై సూచనలు చేశామని విలేకరుల ఎదుట వెల్లడించారు.