Begin typing your search above and press return to search.

ఈసారి మాత్రం యువరాజు టైమింగ్ అదిరింది

By:  Tupaki Desk   |   6 March 2016 10:22 AM IST
ఈసారి మాత్రం యువరాజు టైమింగ్ అదిరింది
X
అవసరం లేని విషయాలు పట్టుకొని లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. కాంగ్రెస్ యువరాజు తాజాగా తెలివైన పని ఒకటి చేస్తున్నారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా సరైన సమయంలో.. సరైన అంశంపై గళం విప్పి.. పలువురి మనసుల్ని దోచుకోవటమే కాదు.. తన పోరాటాన్ని సాగిస్తే.. ఆయనకో పెద్ద వర్గమే అండగా నిలిచే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

అవసరం లేని విషయాల మీద ఫోకస్ చేసి విమర్శల పాలవుతున్న రాహుల్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. జైట్లీ బడ్జెట్ లో ఉద్యోగుల ఈఫీఎఫ్ మీద వడ్డీ వేసే నిర్ణయాన్ని ప్రకటించగా.. దానిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయటమే కాదు.. ఇప్పుడా విషయాన్ని ఒక నినాదంగా తీసుకొని ఆయన పదే పదే ప్రస్తావిస్తుండటం గమనార్హం.

ఇప్పటివరకూ రాహుల్ మాట్లాడిన అంశాల్లో ఈఫీఎఫ్ అంశం సరైనదన్న అభిప్రాయంతో పాటు.. ఆయన వెనుక ఉద్యోగ వర్గం నిలవాల్సిన పరిస్థితి. తమ ప్రయోజనాల్ని భారీగా దెబ్బ తీసేలా మోడీ సర్కారు ఆలోచించటం పట్ల ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. మోడీ సర్కారు అధికారంలోకి రావటానికి మధ్యతరగతి.. ఎగుమ మధ్యతరగతికి చెందిన ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగులు కోట్లాది మంది ఉన్నారు. కానీ.. వారందరి ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఈఫీఎఫ్ విత్ డ్రాయిల్ మీద పన్ను విధించటంపై ఉద్యోగులంతా మండిపడుతున్నారు.

ఈ జనాగ్రహాన్ని గుర్తించిన రాహుల్.. ఈ మధ్యనే లోక్ సభలో ప్రస్తావించారు. దీనికి వచ్చిన స్పందనను చూసిన ఆయన.. ఉద్యోగులకు మేలు కలిగే ఈఫీఎఫ్ ఇష్యూ మీద మరింత ముందుకు వెళ్లటంతో పాటు.. మోడీ సర్కారును ఇబ్బంది పెట్టేందుకు తనకు లభించిన అపురూపమైన ఆయుధంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆయన అసోం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సభలోనూ ఈపీఎఫ్ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించటం గమనార్హం. ‘‘నిజాయితీగా కూడబెట్టుకున్న ఉద్యోగుల సొమ్ముపై పన్ను విధించకూడదని ప్రధానికి సూచించా. కానీ.. గురువారం పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రసంగంలో దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నల్లధనం కలిగి ఉన్న కొద్దిమంది ప్రారిశ్రామికవేత్తలను ప్రోత్సాహిస్తున్నట్లుగా మోడీ తీరు ఉంది. వారి ప్రయోజనాల్ని రక్షిస్తున్న మోడీ.. జీవితాంతం దాచి పెట్టుకున్న ఉద్యోగుల మొత్తం మీద మాత్రం పన్ను భారం మోపటం ఏమిటి? అందుకే.. ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ వదిలిపెట్టం’’ అంటూ స్పష్టం చేశారు.

తమ ప్రయోజనాల్ని భారీగా దెబ్బ తీసే ఈపీఎఫ్ వ్యవహారంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాదు.. ఆగ్రహంగా ఉన్నారు. తమకు భారీగా నష్టం కలిగించే ఈ అంశంపై రాజకీయ నేతలు ఎవరూ నోరు విప్పని నేపథ్యంలో.. రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు వారికి కొత్త ఉత్సాహం ఇవ్వటమే కాదు.. తమకు అండగా నిలుస్తున్న రాహుల్ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. ఈ పరిణామం మోడీ సర్కారుకు ఏమాత్రం మంచిది కాదన్న విషయాన్ని కమలనాథులు గుర్తిస్తే మంచిది.