Begin typing your search above and press return to search.

#వ‌ణ‌క్క‌మ్ రాహుల్ గాంధీ!... వైర‌ల్ హ్యాష్ ట్యాగ్‌!

By:  Tupaki Desk   |   13 March 2019 3:58 PM IST
#వ‌ణ‌క్క‌మ్ రాహుల్ గాంధీ!... వైర‌ల్ హ్యాష్ ట్యాగ్‌!
X
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ... రాజ‌కీయాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేని నేత‌గానే మ‌న‌కు తెలుసు. కేవలం గాంధీ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన నేప‌థ్యం త‌ప్పించి రాహుల్ గాంధీలో పెద్ద‌గా ప్ర‌త్యేక‌త‌లేమీ లేవ‌నే చెప్పాలి. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊప‌రి ఊదుతార‌ని అంతా భావిస్తే... ఉన్నపాటి కాస్తంత ప్ర‌భ‌ను కూడాఆ పార్టీ కోల్పోయేలా చేస్తున్నార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. అయితే ఇదంతా రాజ‌కీయాల్లోనే. ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్‌ గానే ఉన్న రాహుల్ గాంధీకి యువ‌త‌లో ప్ర‌త్యేకించి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగే ఉంద‌ని చెప్పాలి. రాహుల్ ను చూసేందుకు, ఆయ‌న‌తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూప‌ని అమ్మాయంటూ ఉండ‌దేమో. ఇదేమీ మ‌న‌కు మ‌నంగా చెప్పుకుంటున్న విష‌యం కాదు. రాహుల్ ఎక్క‌డికి వెళ్లినా ఆయ‌న స‌మావేశాల‌కు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తున్న యువ‌త‌... ప్ర‌త్యేకించి ఆయ‌న‌తో మాట్లాడేందుకు అమితాస‌క్తి చూపుప‌తున్న వైనమే ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తోంద‌ని చెప్పాలి.

తాజాగా ఈ మాట నిజ‌మేనంటూ మ‌రో ఉదంతం చెబుతోంది. చెప్ప‌డ‌మే కాదండీ బాబూ.. ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియీలో తెగ వైర‌ల్ అయిపోతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత ఎన్నిక‌ల న‌గారాను మోగించేసిన రాహుల్ గాంధీ... నేడు త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ స‌మావేశానికి యువ‌త భారీగా త‌ర‌లివ‌చ్చింది. రాహుల్ రాక‌కు చాలా ముందుగానే అక్క‌డికి వ‌చ్చి కూర్చున్న యువ‌తులు... రాహుల్ రాక కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూడ‌టం క‌నిపించింది. రాహుల్ ప‌ట్ల ఏ మేర ఆస‌క్తి ఉంద‌న్న విష‌యాన్ని తెలియ‌జేసేందుకు కాంగ్రెస్ పార్టీ త‌మిళ‌నాడు శాఖ పార్టీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో *వ‌ణ‌క్క‌మ్ రాహుల్ గాంధీ* అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ ను దించేసింది. ఈ హ్యాష్ ట్యాగ్ త‌మిళ‌నాడు యువ‌తుల‌ను బాగానే ఆక‌ట్టుకుంద‌ని చెప్పాలి.

రాహుల్ ను చూసేందుకు నేరుగా స‌మావేశానికి వ‌చ్చేసిన యువ‌తులు ఆయ‌న రాక‌కోసం వేచి చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ యువ‌తి మ‌రింత ఎగ్జైట్‌ మెంట్‌ కు గురై... రాహుల్ కోసం వేచి చూడ‌టంకూడా త‌న‌తో కావ‌డం లేదంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసింది. ఈ చిన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ త‌న ట్విట్ట‌ర్ పోస్ట్ చేసింది. ఇప్పుడీ చిన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోయింది. ఇదిలా ఉంటే... త‌న కోసం అమ్మాయిలంతా వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తూ ఉంటే... రాహుల్ కూడా వారి ఎగ్జైట్ మెంట్ ను ఏమాత్రం నిరాశ ప‌ర‌చ‌కూడ‌ద‌నుకున్నారో, ఏమో తెలియదు గానీ... లాల్చీ పైజామాను వ‌దిలేసి ఏకంగా కాలేజీ కుర్రాడిలా జీన్స్, టీ ష‌ర్ట్ లో ప్ర‌త్య‌క్ష‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. త‌న కోసం ఎద‌రు చూస్తున్న యువ‌తుల‌ను ఆయ‌న అదే ఎగ్జైట్ మెంట్ లోనే కొన‌సాగేలా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.