Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంబురాల స‌మ‌యంలో రాహుల్ గాంధీ ట్విస్ట్

By:  Tupaki Desk   |   2 Jun 2022 5:49 AM GMT
కేసీఆర్ సంబురాల స‌మ‌యంలో రాహుల్ గాంధీ ట్విస్ట్
X
ఎన్నిక‌లు ఇప్పుడే జ‌రుగుతున్నాయా...అన్న‌త హాట్ హాట్ గా తెలంగాణ రాజకీయం మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుగ‌డ‌లు, మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలైన బీజేపీ & కాంగ్రెస్ కౌంట‌ర్ అటాక్‌లు, సొంత వ్యూహాల‌తో తెలంగాణ రాజ‌కీయం మాంచి కాక మీదుంది. ఇలాంటి స‌మ‌యంలో జ‌రుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం... అన్ని పార్టీల‌కు త‌మ రాజ‌కీయ వైఖ‌రిని తెలియ‌జేసే సంద‌ర్భంగా మారింది.

ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబురాలు చేస్తుండ‌గా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ కీల‌క నేత రాహుల్ గాంధీ త‌న‌దైన శైలిలో టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా త‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన రాహుల్ గాంధీ ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ వైఖ‌రిపై ఒకింత ఘాటుగానే స్పందించారు. 'తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ #TelanganaFormationDay శుభాకాంక్షలు.

ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.' అని రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. దీనికి కొన‌సాగింపుగా చేసిన మరో ట్వీట్లో ఆయ‌న గులాబీ స‌ర్కారుపై మండిప‌డ్డారు.

గత 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలనలో దారుణమైన పాలనను చవి చూసింది అని మ‌రో ట్వీట్లో రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. ''#TelanganaFormationDay నాడు, ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేదలు & సామాన్య ప్రజలకు శ్రేయస్సు తీసుకురావడంపై దృష్టి సారించిన ఒక మోడల్ రాష్ట్రంగా, ఉజ్వల తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ నిబద్ధతను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను'' అని త‌మ వైఖ‌రిని తెలియ‌జేశారు. కాగా, ఈ ట్వీట్ల‌కు టీఆర్ఎస్ పార్టీ సానుభూతి వ‌ర్గాలు త‌మ‌దైన శైలిలోనే కౌంట‌ర్ ఇచ్చాయి.