Begin typing your search above and press return to search.

రైతుల‌ను సెంటిమెంట్‌ తో ట‌చ్ చేస్తున్న రాహుల్‌

By:  Tupaki Desk   |   17 Feb 2019 11:22 AM IST
రైతుల‌ను సెంటిమెంట్‌ తో ట‌చ్ చేస్తున్న రాహుల్‌
X
రెండు హెక్టార్ల (ఐదెకరాల)లోపు సాగుభూమి ఉన్న రైతులకు ఏటా నేరుగా రూ.6 వేల నగదు సాయాన్ని అందించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం త‌మ‌కు ఓట్లు కురిపించేదిగా బీజేపీ నేత‌లు ఖుష్ అవుతుంటే...మ‌రోవైపు అదే ప‌థ‌కం ఆధారంగా, అధికార పార్టీని ఇర‌కాటంలో ప‌డేసేందుకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. బ‌డా వ్యాపార‌వేత్త‌లైన‌ అనిల్ అంబానీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి వ్యక్తులకు కోట్లాది రూపాయలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం.. రైతులకు మాత్రం రోజుకు కేవలం రూ.3.50 ఇస్తామని ప్రకటించిందని విమర్శించారు. త‌ద్వారా రైతుల‌ను సెంటిమెంట్‌ను ట‌చ్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఛత్తీస్‌ గఢ్‌ లోని బస్తర్ జిల్లా ధురాగావ్‌ లో గిరిజనుల సదస్సులో మాట్లాడుతూ నరేంద్రమోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించినప్పుడు లోక్‌ సభలో బీజేపీ ఎంపీలు బల్లలు చరచడాన్ని రాహుల్ గుర్తుచేస్తూ.. ఇది జోక్ కాదా? అని ప్రశ్నించారు. ``పెద్ద నోట్లను రద్దుచేస్తూ మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల మీరంతా బ్యాంకుల ముందు క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారు ఎప్పుడైనా క్యూలో నిల్చోవడాన్ని మీరు చూశారా? ఇది నల్లధనంపై పోరాటమే అయితే నిజాయితీపరులైన ప్రజలంతా క్యూలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ``అని రాహుల్ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ప్రజల సొమ్మును లాక్కుందని, వ్యాపారవేత్తలు చెల్లించాల్సిన లక్షల కోట్ల రూపాయల రుణాలను మాత్రం మాఫీ చేసిందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీ ప్రభుత్వం అర్ధరాత్రి పూట గబ్బర్ సింగ్ టాక్స్‌ను(జీఎస్టీని) తీసుకొచ్చి వర్తకుల వ్యాపారాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు.

దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలోకి రూ.15 లక్షలు బదిలీ చేయడంతోపాటు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తామని గత లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని రాహుల్‌ విమర్శించారు. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే పేద ప్రజలకు కనీస ఆదాయాన్ని కల్పిస్తామని, ఆ సొమ్మును నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని రాహుల్ తెలిపారు.