Begin typing your search above and press return to search.

రాహుల్ మ‌రోసారి సారీ చెప్పేస్తున్నార‌బ్బా!

By:  Tupaki Desk   |   30 April 2019 6:50 PM IST
రాహుల్ మ‌రోసారి సారీ చెప్పేస్తున్నార‌బ్బా!
X
అస‌లే ఎన్నిక‌లు, అందులోనూ తాను పార్టీ చీఫ్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి సార్వ‌త్రిక ఎన్నిక‌లు. బిజీ షెడ్యూల్‌... అయినా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి అడుగ‌డుగునా క‌ష్టాలు త‌ప్ప‌ట్లేదు. ఓ వైపు త‌న ప్ర‌భావం ఎంత‌మాత్రం క‌నిపించే అవ‌కాశాలు లేవ‌న్న విశ్లేష‌ణ‌లు.. అయినా కూడా చేతులెత్తేసి కూర్చోలేని ప‌రిస్థితి. ఇలాంటి నేప‌థ్యంలో ఇటు కేంద్ర ఎన్నిక‌ల సంఘం, అటు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుల నుంచి వ‌రుస‌గా వ‌స్తున్న నోటీసులు. ఈసీ నోటీసుల‌ను ఎలాగోలా మేనేజ్ చేసుకోగ‌లిగినా... సుప్రీంకోర్టు నోటీసుల వ్య‌వ‌హారం అంత ఆషామాషీ కాదు క‌దా. అయితే ఇక్క‌డ రాహుల్ టీం మాత్రం అంత అనుభవంతో ఉన్న‌దేమీ కాదాయే. వెర‌సి రాహుల్ కు ఈ ఎన్నిక‌ల్లో సుప్రీంకోర్టు నోటీసుల రూపంలో ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపిస్తున్నాయని చెప్ప‌క త‌ప్ప‌దు.

కాపాలాదారుడినంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌న‌దైన శైలి సెటైర్లు సంధించిన రాహుల్ గాంధీ... చౌకీదార్ చోర్ హై అంటూ ఈ కాప‌లాదారుడు దొంగేనంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై సుప్రీంకోర్టులో పిటిష‌న్ రాగా.... ఎందుకొచ్చిన త‌ల‌నొప్పి అంటూ రాహుల్ గాంధీ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పేందుకు సిద్ధ‌ప‌డ్డారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ నిండా కాక‌లు తీరిన న్యాయ కోవిదులు చాలా మందే ఉన్నారు. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అభిషేక్ మ‌ను సింఘ్వీ కూడా పేరు మోసిన లార‌యే. అయితే రాహుల్ క్ష‌మాప‌ణ‌ల‌ను మాత్రం ఆయ‌న కోర్టుకు అనుకూలంగా పంపే విష‌యంలో విఫ‌ల‌మ‌య్యారు. మోదీపై చేసిన వ్యాఖ్య‌లకు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డానికి బ‌దులుగా... సుప్రీంకోర్టుకు ఓ అభియోగాన్ని మోపేలా క్ష‌మాప‌ణ లేఖ‌ను రాసేశారు.

ఏకంగా 22 పేజీల ఈ పిటిష‌న్ లో రాహుల్ సారీని సింఘ్వీ అండ్ కో... సుప్రీంకోర్టుకు సూటిగా చెప్ప‌లేక‌పోయారు. దీంతో కోర్టు మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ త‌మ ముందు హాజ‌రుకావాల్సిందేన‌ని రాహుల్ కు బాంబులాంటి వార్త‌ను వినిపించింది. ఈ క్ర‌మంలో మ‌రో సారీ చెప్పేందుకు రాహుల్ సిద్ధ‌మైపోయారు. సోమ‌వారంలోగా ఈ రెండో సారీని రాహుల్ గాంధీ త‌ర‌ఫున మ‌ళ్లీ సింఘ్వీనే సుప్రీంకోర్టుకు తెల‌ప‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యంపై మాట్లాడిన సింఘ్వీ... తాము ఇదివ‌ర‌కు దాఖ‌లు చేసిన క్ష‌మాప‌ణ‌ల పిటిష‌న్ ను 22 పేజీల్లో రూపొందించినా.. మూడు త‌ప్పులు దొర్లాయ‌ని, దీంతోనే ఇబ్బంది వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించారు. సోమ‌వారంలోగా దాఖ‌లు చేయ‌నున్న పిటిష‌న్ ను మాత్రం కాస్తంత ప‌క‌డ్బందీగా జాగ్ర‌త్త‌గా చూసుకుని మ‌రీ దాఖ‌లు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ సారి కూడా రాహుల్ సారీని అటూ ఇటూ తిప్పితే మాత్రం రాహుల్ గాంధీ కోర్టు మెట్లెక్క‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.