Begin typing your search above and press return to search.

ఎప్పుడో జరిగే ఎన్నికలకు అప్పుడే జోస్యాలా?

By:  Tupaki Desk   |   13 Dec 2015 3:16 PM IST
ఎప్పుడో జరిగే ఎన్నికలకు అప్పుడే జోస్యాలా?
X
కొద్ది నెలల తర్వాత జరిగే ఎన్నికలకు సంబంధించి గెలుపోటముల మీద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్పుడే జోస్యాలు చెప్పటం మొదలెట్టారు. బీహార్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ.. అదే రీతిలోనే అసోంలో కూడా ఓటమి తప్పదని తేల్చి చెబుతున్నారు కాంగ్రెస్ యువరాజు. తాజాగా అసోం పర్యటించిన ఆయన.. వచ్చే ఏడాదిలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు.

బీహార్ లో మాదిరే అసోంలో కూడా బీజేపీపై ఘన విజయం సాధిస్తామని చెప్పారు. బార్సెటా జిల్లాలోని ఒక ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టి.. ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన ఒక మసీదు వద్ద తన యాత్రను ముగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరిగే అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని రిజెక్ట్ చేయటం ఖాయమని తేల్చారు.

తాజాగా రాహుల్ పర్యటించిన బార్సెట్ జిల్లాలో 70 శాతం మంది ముస్లింలు ఉండటం గమనార్హం. అయినా.. బీహార్ లో భారీ విజయం సాధించామని చెప్పుకుంటున్న రాహుల్.. తమ పార్టీ సొంతంగా ఎన్ని సీట్లు తెచ్చుకుందో గుర్తు తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. ఎప్పుడో జరిగే ఎన్నికల ఫలితాలపై ఇప్పటి నుంచే జోస్యాలేమిటో..?