Begin typing your search above and press return to search.

బాబు తీరుపై రాహుల్ గ్రూప్ గరం! పక్కన పెడతారా?

By:  Tupaki Desk   |   29 April 2019 8:00 PM IST
బాబు తీరుపై రాహుల్ గ్రూప్ గరం! పక్కన పెడతారా?
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన తీరుతో ఇప్పటికే ఎన్డీయేకు దూరం అయ్యారు. బాబు ఒక అవకాశవాది అని మోడీ భావిస్తూ ఉన్నారు. తమ పార్టీతో నాలుగున్నరేళ్ల పాటు కొనసాగి, తన కేబినెట్లో తెలుగుదేశం మంత్రులను నాలుగున్నరేళ్ల పాటు కొనసాగించి.. తీరా ఎన్నికలు దగ్గర పడ్డాకా తమ మీద ధ్వజమెత్తుతూ చంద్రబాబు నాయుడు బయటకు వెళ్లడానికి మోడీ, అమిత్ షాలు అంత తేలికగా తీసుకోవడం లేదు.

చంద్రబాబు నాయుడు విషయంలో వారు ఇప్పటికే ఒక ఒపీనియన్ కు వచ్చేశారు. ఒకవేళ బాబు అవసరం వారికి ఏర్పడకపోతే.. మళ్లీ బీజేపీ సర్కారు వస్తే చంద్రబాబుకు వారు చుక్కలు చూపే అవకాశాలు లేకపోలేదు. బాబు ప్రదర్శించిన అవకాశవాదం అలాంటిది మరి!

కేవలం ఎన్డీయేలోనే కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా బాబు తీరుపై ఒకింత ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. చంద్రబాబు నాయుడు తన తీరుతో రాహుల్ నే ఇబ్బంది పెడుతున్నాడని ఆయన కోటరీ భావిస్తోందట.

ఇటీవలే మహారాష్ట్ర రాజకీయ నేత శరద్ పవార్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పదవికి తగిన వ్యక్తి..' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 'మమతా బెనర్జీ, మాయవతి, చంద్రబాబు..' అంటూ రాహుల్ కు ప్రత్యామ్నాయంగా పేర్లను చెప్పాడు పవార్.

అయితే అది పవార్ అభిప్రాయం కాదని, చంద్రబాబు నాయుడే పవార్ చేత అలా తనకు అనుకూలంగా మాట్లాడింపజేసి ఉంటారని రాహుల్ కోటరీ అభిప్రాయ పడుతోందట. అసలే రాహుల్ గాంధీని నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఆయన కోటరీ చాలా కష్టపడుతూ ఉంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు ఇలా కుట్రలు చేస్తూ ఉన్నారని, ఇదంతా రాహుల్ టీమ్ గమనిస్తోందని..అయితే ప్రస్తుతానికి స్పందించే అవకాశం లేదని తెలుస్తోంది.

ఎన్నికలు అయిపోతే.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాన్ని బట్టి రాహుట్ కోటరీ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఎలాగూ ఏపీలో చంద్రబాబు నాయుడు పార్టీ పెద్దగా సీట్లను నెగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అప్పుడు అదును చూసి చంద్రబాబు నాయుడి కుతంత్రాలకు చెక్ పెట్టాలని వారు భావిస్తున్నారని సమాచారం.