Begin typing your search above and press return to search.
రాహుల్ తర్వాతి టార్గెట్ తెలంగాణే
By: Tupaki Desk | 23 Dec 2017 12:54 PM ISTతెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బలపడటం - తమ పార్టీపై పడిన అవినీతి ముద్ర తొలిగిపోతున్న నేపథ్యంలో జాతీయ పార్టీ సంతోషంలో ఉండగా...రాష్ట్ర పార్టీ సైతం అదే జోష్ లో ఉంది. ముఖ్యంగా ఎఐసీపీ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ విషయంలో ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. రాహుల్ ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. తెలంగాణలో కొద్దిగా కష్టపడితే పార్టీని కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మరింత బలోపేతం చేసుకుని - అధికారం చేపట్టవచ్చని ఆయన భావిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారని తెలుస్తోంది. 2019లో జరగబోయే లోక్ సభ - అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలోగా తెలంగాణను కలియ తిరగాలని రాహుల్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా రాహుల్ టీపీసీసీ నాయకత్వాన్ని ఆదేశించారని సమాచారం.
మరోవైపు లోక్ సభ సీట్లనూ ఎక్కువ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందని రాహుల్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాల్సిందిగా పార్టీ రాష్ట్ర నేతలు ఆయనను ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అదే సమయంలో పార్టీ బలోపేతానికి తగు చర్యలను టీపీసీసీ తీసుకుంటోంది. కవి - గాయకుడు ఏపూరి సోమన్న నేతృత్వంలో టి.పీసీసీ సాంస్కృతిక సేనను ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు. లీగల్ సెల్ - ఆర్ టిఐ డిపార్ట్‌మెంట్ చైర్మన్ గా సి. దామోదర్ రెడ్డి - మీడియా సలహాదారునిగా తిరుమలగిరి సురేందర్ ను నియమించారు.
స్థూలంగా ఇటు పార్టీ పరంగా బలోపేతం చేసుకునే కార్యక్రమాలతో పాటు అటు రాహుల్ అండతో ముందుకు వెళ్లే ప్రణాళికలను కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ అయ్యే ఆలోచనను కాంగ్రెస్ చేస్తున్నట్లు సమాచారం. 2018లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
