Begin typing your search above and press return to search.

ఎవరిని విమర్శించాలన్నా అదే యాంగిలా...?

By:  Tupaki Desk   |   24 July 2015 3:17 PM IST
ఎవరిని విమర్శించాలన్నా అదే యాంగిలా...?
X
అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ తన పాదయాత్ర ముగించిన తరువాత అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాదయాత్రకు పెద్దసంఖ్యలో జనాలను తరలించడంతో పాదయాత్ర, బహిరంగ సభ కూడా కిటకిటలాడాయి. అయితే... రాహుల్ ప్రసంగంలో మాత్రం పెద్దగా కొత్తదనమేమీ లేదు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను విమర్శించడానికి ఎంచుకున్న అంశాలనే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలకూ ఉపయోగించుకున్నారాయన. చంద్రబాబు విదేశీ పర్యటనలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత పేరు చంద్రబాబు అని... కానీ, ఎన్నికలలో గెలిచి అధికారంలోనికి వచ్చిన తరువాత ఆయన విదేశీ బాబుగా మారిపోయారని రాహుల్ గాందీ చమత్కరిస్తూ విమర్శించారు. ఇప్పుడు ఆయనకు విదేశీ పర్యటనలపైనే తప్ప...పేదల సంక్షేమంపై దృష్టి లేదని ఆరోపించారు.

ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి గానీ ఆయన పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు రైతుల గురించి ఎన్నొ కబుర్లు చెప్పిన ఆయన ఇప్పుడు పేదల గురించి పూర్తిగా విస్మరించారన్నారు. రైతాంగాన్ని ఆదుకుంటామంటూ రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోనికి వచ్చి ఏడాది అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం కాంగ్రెస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.

2001లో ఇక్కడ పర్యటించినప్పుడు ఈ అనంత పురం జిల్లాలో పేదల కష్టాలను చూసిన సోనియా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారని.. 2001 ప్రాంతలో ఈ జిల్లాలో వలసలు ఎక్కువగా ఉండేవి. జాతీయ ఉపాథి హామీ ఫథకం అమలయ్యాక వలసలు తగ్గాయి... పేదలకు ఇన్ని ప్రయోజనాలు చేకూర్చి పెట్టిన ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ పనికి మాలిన పథకం అంటున్నారు...ఆలోచించండి పేదల పక్షాన ఉండేది ఏ పార్టీయో మీ కే తెలుస్తుంది అని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలతో ఊదరగొట్టేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడేం చేస్తున్నారు. అన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టి పేదల సంక్షేమాన్ని మర్చిపోతున్నారని ఆరోపించారు.