Begin typing your search above and press return to search.

పంజాబ్ స్కాంలో జైట్లీ కుమార్తె పాత్రేంటి?

By:  Tupaki Desk   |   12 March 2018 3:33 PM IST
పంజాబ్ స్కాంలో జైట్లీ కుమార్తె పాత్రేంటి?
X
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ను ముంచేస్తూ నీర‌వ్ మోడీ భారీ ఎత్తున స్కాంకు పాల్ప‌డ‌టం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ఉదంతంపై మోడీ స‌ర్కారు తీవ్ర ఇబ్బందుల‌కు గురైంది. మోడీ స‌ర్కారు ఇమేజ్ దారుణంగా దెబ్బ తింది కూడా. ఇదిలా ఉంటే.. ఈ స్కాంకు సంబంధించి సంచ‌ల‌న కోణాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.

పీఎన్‌ బీని రూ.12,600 కోట్ల‌కు ముంచిన నీరవ్ మోడీ ఎపిసోడ్ లో కేంద్ర ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబానికి పాత్ర ఉంద‌ని.. ఈ కార‌ణంతోనే ఆయ‌న నోరు విప్ప‌టం లేద‌న్న సంచ‌ల‌న ఆరోప‌ణ‌ను రాహుల్ చేశారు. జైట్లీ కుమార్తెకు మేలు జ‌రిగింద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

న్యాయ‌వాది అయిన జైట్లీ కుమార్తెకు.. గీతాంజ‌లి జెమ్స్ తో లావాదేవీలు ఉన్న‌ట్లుగా రాహుల్ ఆరోపిస్తున్నారు. ఇందుకు జాతీయ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల్ని ఆయ‌న కోట్ చేస్తున్నారు. తాజాగా ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేసిన ఆయ‌న పెను దుమారానికి తెర తీశారు.

న్యాయ‌వాదిగా ప‌ని చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తెను కాపాడుకోవ‌టానికి ఆయ‌న పీఎన్ బీ స్కాంపై మౌనంగా ఉన్నార‌న్నారు. ఈ స్కాం బ‌య‌ట‌కు రావ‌టానికి నెల ముందే.. జైట్లీ కుమార్తెకు నిందితులు పెద్ద ఎత్తున డ‌బ్బును ఇచ్చిన‌ట్లుగా ఆయన ఆరోపించారు. నిందితుల‌కు చెందిన న్యాయ సంస్థ‌ల‌పై సీబీఐ దాడులు చేసింద‌న్న రాహుల్.. అదే స‌మ‌యంలో జైట్లీ కుమార్తెకు చెందిన సంస్థ‌ల్లో మాత్రం దాడులు ఎందుకు నిర్వ‌హించ‌లేద‌న్న సూటి ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. రాహుల్ క్వ‌శ్చ‌న్లు ఇప్పుడు కొత్త దుమారంగా మారాయి.