Begin typing your search above and press return to search.

మోడీపై పంచ్ వేసిన ‘యువరాజు’

By:  Tupaki Desk   |   22 Aug 2016 10:38 AM IST
మోడీపై పంచ్ వేసిన ‘యువరాజు’
X
దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. ఆ పార్టీ ‘యువరాజు’గా కీర్తించే రాహుల్ గాంధీ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. మోడీపై తీవ్ర అసహనంతో ఉన్న రాహుల్ కు.. ప్రధానిపై సరిగ్గా విమర్శలు చేసే సబ్జెక్ట్ దొరక్క కిందా మీదా పడుతున్న పరిస్థితి. ఏ విషయంలోనూ దొరకని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటానికి ఆయన చాలానే ట్రై చేస్తున్నా.. అవకాశం దొరకటం లేదు.

అందుకే.. వివాదాస్పదమైన మోడీ సూటుకు సంబంధించిన వార్త తెర మీదకు వచ్చిన వెంటనే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ కు వచ్చిన సందర్భంగా మోడీ ఒక సూట్ వేసుకోవటం.. ఖరీదైన ఆ సూట్ పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మోడీ పేరును బంగారు తీగతో రాసి ఉంచే ఈ సూట్ కారణంగా తనకు ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో దాన్ని వేలానికి పెట్టేసి.. ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. సదరు సూట్ రికార్డు స్థాయిలో అమ్ముడై.. గిన్నిస్ లో చోటు లభించటం తెలిసిందే. ఈ విషయాన్ని తనదైనశైలిలో ప్రస్తావించిన కాంగ్రెస్ యువరాజు రాహుల్.. ‘‘ప్రధాని చేసిన అమిత త్యాగానికి అది సముచిత గుర్తింపు’’ అంటూ ఎటకారం చేసుకునే ప్రయత్నం చేశారు. వేలంలో అమ్ముడైన అత్యంత ఖరీదైన సూటుగా గిన్నిస్ లో చోటు లభించిందన్నవార్తలు వచ్చిన వెంటనే రాహుల్ వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ప్రత్యర్థిని దెబ్బ తీసే అవకాశం వస్తే ఏ రాజకీయ నేత మాత్రం వదులుకుంటారు. అందులోకి మోడీ లాంటి నేత మీద అరుదుగా లభించే అవకాశాన్ని రాహుల్ లాంటి వారు ఎందుకు మిస్ చేసుకుంటారు..?