Begin typing your search above and press return to search.

రాహుల్ స‌ర్వే!... జ‌గ‌న్‌ దే అధికారం!

By:  Tupaki Desk   |   6 Feb 2018 3:08 PM IST
రాహుల్ స‌ర్వే!... జ‌గ‌న్‌ దే అధికారం!
X
2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిపైగానే స‌మ‌యం ఉంది. అయితే అప్పుడే దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి రాజుకుంద‌నే చెప్పాలి. దేశ‌వ్యాప్తం అనే కంటే న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మ‌రింత‌ ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 2014 ఎన్నిక‌ల్లో వెంట్రుక వాసిలో అధికారానికి దూర‌మైన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... 2019లో మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిందేన‌న్న క‌సితో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ఆయ‌న ప్ర‌జా సంకల్ప‌యాత్ర పేరిట సుదీర్ఘ పాద‌యాత్ర చేపట్టారు. రెండున్న‌ర నెల‌ల క్రితం త‌న సొంత జిల్లాలోని త‌న తండ్రి స‌మాధి ఇడుపుల‌పాయ సాక్షిగా మొద‌లెట్టిన ఈ యాత్ర‌లో జ‌గ‌న్ ఇప్ప‌టికే నాలుగు జిల్లాల‌ను చుట్టేశారు. ప్ర‌స్తుతం నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్ యాత్ర సాగుతోంది. జ‌గ‌న్ యాత్ర సాగుతున్న కొద్దీ... వ‌చ్చే ఎన్నికల్లో అధికారంలోకి వ‌చ్చేదెవ‌ర‌న్నవిష‌యంపై అంత‌కంత‌కూ ఆసక్తి పెరిగిపోతోంది. సాక్షాత్తు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కూడా త‌న భవిష్య‌త్తు ఎలా ఉంటుందోన‌న్న అనుమానంతో ఏకంగా రెండు సర్వేలు చేయించుకున్న వైనం మ‌న‌కు తెలిసిందే. జాతీయ స్థాయి సంస్థ‌లు నిర్వ‌హించిన ఈ రెండు స‌ర్వేల్లో టీడీపీకే అధికారం ద‌క్కుతుంద‌ని తేలిపోయింది. అయితే చంద్ర‌బాబు సొంతంగా చేయించుకున్న స‌ర్వేలో ఆయ‌న‌కు సానుకూలంగా కాకుండా వ్య‌తిరేకంగా ఫ‌లితాలు ఎలా వ‌స్తాయ‌న్న ప్ర‌శ్న‌లు వినిపించాయి.

అయితే యాత్ర‌లో నానాటికీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్ మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతూ స‌ర్వేల‌కు దూరంగానే ఉన్నార‌ని చెప్పాలి. జ‌గ‌న్ ఊరికే ఉన్నా... స‌ర్వేలు నిర్వ‌హించే సంస్థ‌లు మాత్రం ఊరికే ఉండ‌వు క‌దా. నిజ‌మే.. మొన్న‌టికి మొన్న జాతీయ స్థాయిలో పేరొందిన మీడియా సంస్థ‌లు వేర్వేరుగా - కొన్ని ఉమ్మ‌డిగా క‌లిసి చేసిన స‌ర్వేల్లో ఈ ద‌ఫా జ‌గ‌న్ కు అధికారం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ఈ స‌ర్వేల‌న్నింటిలోకి రిపబ్లిక‌న్ టీవీ చేసిన స‌ర్వేను ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే... మొత్తం స‌ర్వేను ఆ మీడియా సంస్థ చాలా ప‌క్కాగా నిర్వ‌హించింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ స‌ర్వే కూడా ఏపీ సీఎం జ‌గ‌నే అంటూ తేల్చేసింది. ఇక ఆక్టోప‌స్ పేరిట దేశంలో ఏ ఎన్నిక‌ల‌కు సంబంధించి అయినా ప‌క్కా అంచ‌నాలు చెప్పేసే సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌ - మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఆధ్వ‌ర్వంలో జ‌రిగిన స‌ర్వేలోనూ... ఏపీలో చంద్ర‌బాబుపై జ‌గ‌న్‌ దే పైచేయిగా తేలిపోయింది. ఇదంతా బాగానే ఉన్నా... ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన స‌ర్వే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్వ‌యంగా చేయించిన‌ట్లుగా ప్ర‌చారంలోకి వ‌చ్చేసిన ఈ స‌ర్వే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారిపోయింద‌ని చెప్పాలి.

ఈ స‌ర్వే కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌దే అధికారం అని తేల్చేసింది. ఏపీలో జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మేన‌ని చెప్ప‌డంతో పాటుగా ఏపీలోని 13 జిల్లాల్లో ఏ జిల్లాలో ఎవ‌రికి ఎన్ని సీట్లు వ‌స్తాయ‌న్న విష‌యాన్ని కూడా ఈ స‌ర్వే చాలా విస్ప‌ష్టంగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 స్థానాల్లో వైసీపీకి 110 సీట్లు వస్తాయ‌ని - అదే స‌మ‌యంలో టీడీపీ 55 స్థానాల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని ఆ స‌ర్వే చెప్పింది. ఈ స‌ర్వేలో ఆయా జిల్లాల‌కు సంబందించిన అసెంబ్లీ స్థానాలు - వాటిలో ఎన్నెన్ని స్థానాలు ఏఏ పార్టీల‌కు వెళ‌తాయ‌న్న విష‌యంపై నిజంగానే రాహుల్ స‌ర్వే చాలా ప‌క్కాగానే జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌ర్నూలు - క‌డ‌ప జిల్లాలు కంచుకోట‌లుగా మారితే... టీడీపీకి మాత్రం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పెట్ట‌ని కోట‌గా మారింది. అయితే వ‌చ్చే ఎన్నికల్లో క‌ర్నూలు జిల్లాలో వైసీపీ ప్ర‌భ కాస్తంత త‌గ్గినా... టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రిలో మాత్రం వైసీపీ మెజారిటీ సీట్ల‌ను ద‌క్కించుకుంటుంద‌ట‌. అదే స‌మ‌యంలో తూర్పు గోదావ‌రి - కృష్ణా జిల్లాలు కూడా టీడీపీకి మంచి ఫ‌లితాల‌నిచ్చే జిల్లాలే. ఈ జిల్లాల్లోనూ జ‌గ‌న్ స‌త్తా చాట‌నున్నార‌ని రాహుల్ స‌ర్వే తేల్చేసింది. మొత్తంగా తాను చేయించుకున్న సొంత స‌ర్వేలు మిన‌హా... ఏ ఒక్క స‌ర్వే కూడా చంద్ర‌బాబుకు అనుకూలంగా లేద‌న్న మాట‌. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో బాబుకు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్న మాటేగా.