Begin typing your search above and press return to search.

గాంధీ జీ హత్య.. ఆర్ ఎస్ ఎస్.. రాహుల్

By:  Tupaki Desk   |   9 Sept 2016 10:40 AM IST
గాంధీ జీ హత్య.. ఆర్ ఎస్ ఎస్.. రాహుల్
X
జాతిపిత గాంధీజీ హత్య ఉదంతంలో ఆర్ ఎస్ ఎస్ పాత్ర ఉందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై ఆర్ ఎస్ ఎస్ మరోసారి తీవ్రంగా మండిపడింది. గాంధీజీ హత్య కేసుకు సంబంధించి సంఘ్ పరివార్ పాత్ర గురించి రాహుల్ తరచూ విమర్శలు చేయటం.. దీనిపై దుమారం రేగటం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించిన పరువునష్టం కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి సంఘ్ కు.. రాహుల్ కు మధ్య తరచూ మాటల యుద్ధం నడుస్తుంటోంది.

తాజాగా అలాంటిదే మరోసారి చోటు చేసుకుంది. మహాత్మాగాంధీ హత్య వెనుక సంఘ్ హస్తం ఉందంటూ రాహుల్ చేసే ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలతో కోర్టుకు ముందకు రావాలంటూ సంఘ్ పరివార్ డిమాండ్చేసింది. గాంధీ హత్యకు ఆర్ ఎస్ ఎస్ కు ఎలాంటి సంబంధం లేకున్నా.. రాహుల్ వ్యాఖ్యానించటం సరికాదన్నారు. గాంధీజీ హత్యతో సంఘ్ కు సంబంధం ఉందా? లేదా? అన్నది న్యాయస్థానం నిర్ణయిస్తుందని ఆర్ ఎస్ ఎస్ నేత మన్మోహన్ వైద్య వ్యాఖ్యానించారు.

గాంధీ హత్యతో సంఘ్ కు సంబంధం ఉందనే రాహుల్.. మొదట తన దగ్గరున్న ఆరోపణల్ని న్యాయస్థానం ముందుకు ప్రవేశ పెట్టాలన్నారు. గాంధీజీ హత్యకు సంబంధించిన ఛార్జ్ షీట్ లో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. రాహుల్ వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని.. అవన్నీ అసత్యాలుగా కొట్టిపారేశారు. కోర్టులు ఉగ్రవాదులగా పేర్కొన్న వారికి మద్దతు ఇస్తున్న రాహుల్ కు.. న్యాయవ్యవస్థ మీద అసలు నమ్మకం ఉందా? అంటూ మండిపడ్డారు. గాంధీ హత్యకు సంబంధించి సంఘ్ కున్న సంబంధంపై ఆధారాల్ని న్యాయస్థానం కంటే ముందు.. మీడియా ముందు ప్రవేశ పెడితే సరిపోతుంది. కానీ.. తరచూ విమర్శలు చేసే రాహుల్.. ఆధారాల్ని మాత్రం ఎందుకు చూపించరు..?