Begin typing your search above and press return to search.
ఎదురు దాడికి రాహుల్ కు లైన్ దొరికిందే!
By: Tupaki Desk | 5 Aug 2017 3:40 PM ISTకేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ, ఆ పార్టీకి సైద్ధాంతిక గురువుగా పేరున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లపై విరుచుకుపడేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఓ చక్కటి లైన్ దొరికేసింది. ఎప్పుడెప్పుడు అధికార పక్షంపై దాడికి దిగుదామా? అంటూ ఎదురు చూస్తున్న రాహుల్... ఆ అవకాశాన్ని చక్కగానే సద్వినియోగం చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. నిన్న గుజరాత్ లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీకి అక్కడ నిరసన సెగలు స్వాగతం పలికాయి. అధికార పక్షానికి జడిసి తమ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించి, మీరు మాత్రం పరామర్శకు వస్తారా? అంటూ అక్కడి ప్రజలు రాహుల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆ తర్వాత పరామర్శ అనంతరం వెనుదిరిగిన రాహుల్ కాన్వాయ్ పై జనం రాళ్లేశారు. ఈ దాడిలో రాహుల్ గాంధీకి ఏమీ కాలేదు గానీ.. ఆయన కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలు పగిలిపోయాయి. దీంతో షాక్ తిన్న రాహుల్ అప్పటికేమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ దాడిపై కాంగ్రెస్ పార్టీ స్పందించేలోగానే బీజేపీ చాలా వేగంగా స్పందించింది. రాహుల్ గాంధీపై దాడి సరికాదని, ఈ తరహా దాడులను తాము ఉపేక్షించేది లేదని, దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తప్పవని కూడా బీజేపీ ప్రకటించింది. అయితే నిన్న దీనిపై మాట మాత్రంగా కూడా స్పందించిన రాహుల్ గాంధీ... కాస్తంత ఆలస్యంగా ఓ మంచి లైన్ పట్టుకుని బీజేపీపై విరుచుకుపడేందుకు మీడియా ముందుకు వచ్చారు.
అయినా తనపై దాడి చేయించిన వారే ఆ దాడిని ఎలా ఖండిస్తారని ఆయన ప్రశ్నించారు. తనపై జరిగిన దాడిలో బీజేపీ నేతలతో పాటు ఆరెస్సెస్ కు చెందిన నేతలు ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి జరిగిన మరుక్షణమే దాడిని ఖండిస్తూ... బీజేపీ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. *నాపై దాడి చేయించిన వారే నా కంటే ముందుగానే ఆ దాడికి ఖండించారు. నాపై జరిగిన దాడిపై నా కంటే ముందుగానే వారు స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం* అని రాహుల్ గాంధీ తన ఆరోపణలకు గల కారణాలను చెప్పుకొచ్చారు. మరి రాహుల్ పట్టుకున్న లైన్, ఆ లైన్ ఆధారంగా చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
