Begin typing your search above and press return to search.

'చౌకీదార్' పై సుప్రీంకు రాహుల్ సారీ..

By:  Tupaki Desk   |   8 May 2019 12:48 PM IST
చౌకీదార్ పై సుప్రీంకు రాహుల్ సారీ..
X
‘రాజీవ్ గాంధీ చనిపోయేంత వరకు అవినీతిపరుడే అన్న మోడీ మాటలపై చర్యలు లేవు.. ఈసీ క్లీన్ చిట్ ఇస్తుంది.. కానీ చౌకీదార్ అని మోడీని అంటే మాత్రం వివరణలు, క్షమాపణలు.. ఇలా తయారైంది మన దేశంలో ప్రస్తుత పరిస్థితి. అధికారపక్షానికి ఒకలా.. ప్రతిపక్షానికి ఒకలా సామాజిక న్యాయం దేశంలో ఉంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా అని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వాళ్లకు స్వతంత్ర వ్యవస్థలకు ఊడిగం చేసినన్నాళ్లు న్యాయం అనేది దేశంలో ఎండమావే అని చెప్పకతప్పదు.

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకు భేషరతు క్షమాపణలు చెప్పారు. విమర్శలు అయితే చేశారు కానీ.. ఆ విమర్శలను సుప్రీం కోర్టుకు అంటగట్టడంతో ఈయన ఇరుక్కుపోయారు. లేదంటే రాహుల్ పై కూడా చర్యలు ఉండేవి కావు. బుధవారం రాహుల్ సారీ చెబుతూ ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనపై నమోదైన కోర్టు ధిక్కార పిటీషన్ ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

రాఫెల్ కుంభకోణం వెలుగులోకి రావడంతో చౌకీదార్ అని చెప్పుకుంటున్న మోడీయే చౌర్ అని (కాపలాదారే దొంగే) అని రాహుల్ గాంధీ వివిధ సభలు, సమావేశాల్లో తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాఫెల్ డీల్ లో కాపలాదారే దొంగ అని సుప్రీం కోర్టే తీర్పుతో చెప్పిందని రాహుల్ నోరు జారారు.. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. తమకు రాజకీయ బురదలోకి లాగుతారా అని కోర్టు ధిక్కార నోటీసులు పంపింది. దీంతో రాహుల్ వివరణ ఇచ్చారు..

సుప్రీం కోర్టుకు తన ఉద్దేశాన్ని ఆపాదించలేదని.. అన్యాపదేశంగా తాను నోరుజారానని.. భేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని రాహుల్ పిటీషన్ దాఖలు చేశారు. బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంలో రాహుల్ చౌకీదార్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయగా.. రాహుల్ కు ధిక్కార నోటీసులను సుప్రీం పంపింది.