Begin typing your search above and press return to search.

పెద్దాయ‌న‌కు రాహుల్ సారీ చెప్పారు

By:  Tupaki Desk   |   19 May 2018 10:12 AM IST
పెద్దాయ‌న‌కు రాహుల్ సారీ చెప్పారు
X
బంధం మ‌రింత బ‌లోపేతం చేసుకోవాలంటే కొన్ని స‌ర్దుబాట్లు త‌ప్ప‌వు. ఆ విష‌యాన్ని గుర్తించి.. ఒక‌డుగు వెన‌క్కి వేస్తే క‌లిగే ప్ర‌యోజ‌నం వేరుగా ఉంటుంది. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అర్థం చేసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత సొంత మెజార్టీ రాని నేప‌థ్యంలో కాంగ్రెస్‌.. జేడీఎస్ లు జ‌త‌క‌ట్టి ప్ర‌భుత్వ ఏర్పాటు కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌టం తెలిసిందే. ఏది ఏమైనా క‌ర్ణాట‌క పీఠాన్ని ద‌క్కించుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా చేసుకున్న బీజేపీ.. ఆ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. ఓప‌క్క జేడీఎస్.. కాంగ్రెస్ ల‌ను చీల్చేందుకు శత‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ..మ‌రోవైపు త‌న‌దైన శైలిలో రాజ‌కీయాల్ని చేస్తోంది.

దీనికి నిద‌ర్శ‌నంగా మాజీ ప్ర‌ధాని.. జేడీఎస్ కు అన్ని ఆయ‌నైన దేవెగౌడ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు ప్ర‌ధాని మోడీ. ప్ర‌ధానే స్వ‌యంగా ఫోన్ చేసి దేవెగౌడ‌తో మాట్లాడ‌టం చూసిన త‌ర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి కొత్త ఆలోచ‌న‌లు వ‌చ్చి ఉంటాయి. క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డిన త‌మ మ‌ధ్య ఉండాల్సిన బంధం పెద్ద‌గా లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తించ‌టంతో పాటు.. ఎన్నిక‌ల వేళ దేవెగౌడ‌ను ఉద్దేశించి తాను చేసిన ప‌రుష వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ సారీ చెప్పలేద‌న్న విష‌యాన్ని గుర్తించారు.

ఒక‌వైపు కొత్త బంధం కోసం ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న మోడీనే ఒక మెట్టు దిగి మ‌రీ ఫోన్లు చేస్తున్న వేళ‌.. తాను సైతం రంగంలోకి దిగ‌పోతే బాగోద‌నుకున్న‌ట్లున్నారు. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. పెద్దాయ‌న్ను సంతోష‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇందుకు దేవెగౌడ పుట్టిన‌రోజుకు మించిన మంచి సంద‌ర్భం మ‌రొక‌టి ఉంద‌ని అనుకున్నారో ఏమో కానీ.. తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పి జేడీఎస్ నేత‌ల్ని సైతం సంతోష‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

ఇవాళ కాకున్నా.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అయినా వ‌ర్క్ వుట్ అవుతుంద‌న్న ముందుచూపో ఏమో కానీ.. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా దేవెగౌడ‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై రాహుల్ విచారం వ్య‌క్తం చేశారు. త‌న‌ను క్ష‌మించాల‌ని కోరారు. బీజేపీకి జేడీఎస్ టీమ్ బి పార్టీ లాంటిద‌న్న త‌న వ్యాఖ్య‌ల‌ను స‌ర్దిచెప్పుకున్న రాహుల్.. దేవెగౌడ ఆరోగ్యం.. సంతోషంగా ఉండాల‌ని దేవుడ్నిప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా దేవెగౌడ‌తో కాసేపు ఫోన్లో మాట్లాడారు.