Begin typing your search above and press return to search.

మోడీపై రాహుల్ విమర్శలు ... కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్ !

By:  Tupaki Desk   |   29 July 2020 4:40 PM IST
మోడీపై రాహుల్ విమర్శలు ...  కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్ !
X
దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న అంశాలని తీసుకోని కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీ తరచుగా దేశ ప్రధాని పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాహుల్ కు ఊహించని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాహుల్ కి సలహాలతో కూడిన చురకలు అంటించడం ఇప్పుడు అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మహా సర్కార్ లో లుకలుకలు ఉన్నాయని , ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో పవార్ వ్యాఖ్యలు వేడిని పుట్టిస్తున్నాయి.

దేశ ప్రధాని మోడీ తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలకు పవార్ కౌంటర్ ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు. ఓ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే.. ఆ వ్యక్తి విశ్వసనీయత తగ్గిపోతుంది. దీనిని రాహుల్ నివారించాలి అంటూ శరద్ పవార్ చెప్పుకొచ్చారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఇదే సమయంలో ఆయన ఆసక్తికర కామెంట్లు కూడా చేశారు.ఎవరు ఔనన్నా, కాదన్నా కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే ఆధారమని పవార్ చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా తను కాంగ్రెస్ పార్టీని చూస్తున్నానని, రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక్క తాటిపైకి తీసుకురావడంలో సోనియాగాంధీ విజయవంతమయ్యారని తెలిపారు.

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ కేడర్ ఒప్పుకుంటుందని... అయితే, అది ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. అయితే... పార్టీ పగ్గాలు రాహుల్‌కు ఇవ్వాల్సిన సమయం మాత్రం ఆసన్నమైందని చెప్పదల్చుకున్నా అని పవార్ అన్నారురాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను వెంటనే చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అందరి నేతలతో సంప్రదింపులు జరుపుతూ... పార్టీ అంతటినీ ఏకతాటిపైకి తేవాలని ఆయన సూచించారు. ‘‘రాహుల్ దేశ పర్యటన ప్రారంభించాలి. కార్యకర్తలు, నేతలందర్నీ కలుసుకోవాలి. ఇదే పని ఆయన చాలా సంవత్సరాల క్రితం చేశారు. మరోసారి ఆ పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.