Begin typing your search above and press return to search.

చెప్పుతో చేసినోళ్లను రాహుల్ ఏమన్నారంటే..

By:  Tupaki Desk   |   26 Sept 2016 8:11 PM IST
చెప్పుతో చేసినోళ్లను రాహుల్ ఏమన్నారంటే..
X
కాంగ్రెస్ పార్టీకి యువరాజుగా వ్యవహరించే రాహుల్ గాంధీకి ఘోర అవమానం చోటు చేసుకుంది. మరికొద్ది నెలల్లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని సమాయుత్తం చేయటం.. వీలైనన్ని ఎక్కువసీట్లను సొంతం చేసుకోవాలన్న మాస్టర్ ప్లాన్ తో అందరికంటే ముందుగా యూపీ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ స్టార్ట్ చేశారు. తాజాగా ఆయన యూపీలోని సీతాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాహుల్ ను లక్ష్యంగా చేసుకొని ఒక యువకుడు చెప్పు విసరటం.. దీన్ని గుర్తించిన రాహుల్ చటుక్కున తప్పుకోవటంతో ఆ చెప్పు వేరే వారికి తగిలింది.

ఈ ఉదంతం పెను సంచలనానికి దారి తీసింది.చెప్పు విసిరే ప్రయత్నం చేసిన యువకుడిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా బీజేపీ.. కాంగ్రెస్ వ్యతిరేక వర్గాల కుట్రగా అభివర్ణించారు. తనపై చెప్పు విసిరిన యువకుడి కోపం అతడి బలహీనతగా రాహుల్ అభివర్ణించారు. అంతేకాదు.. చెప్పు విసిరిన వ్యక్తి బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ కు చెందిన వారై ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ పై చెప్పు విసిరిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి వేరే రాజకీయ పార్టీలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. తనపై చెప్పు విసిరింది ఫలానా వాళ్లు అన్న విషయాన్ని పోలీసులు నిర్దారించకముందే.. రాహుల్ తనను అవమానించింది బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ అని చెప్పటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.