Begin typing your search above and press return to search.

రాహుల్ రాగానే...ప్రియాంక‌కు పోస్ట్ ఇచ్చేస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   7 Dec 2017 7:16 AM GMT
రాహుల్ రాగానే...ప్రియాంక‌కు పోస్ట్ ఇచ్చేస్తాడ‌ట‌
X
కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కేవలం రాహుల్ గాంధీ మాత్రమే పోటీలో ఉన్నందున ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే అనే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీంతో సుదీర్ఘ‌కాలం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్ర‌స్తుత‌ అధినేత్రి సోనియాగాంధీ త‌ర్వాత‌...వారి కుటుంబానికే చెందిన మ‌రో యువ‌నేత కాంగ్రెస్‌ ను న‌డిపించ‌నున్నాడు. అయితే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించిన అనంతరం సోదరి ప్రియాంకా గాంధీకి మ‌రో పోస్ట్ ద‌క్క‌నుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెప్తున్నారు. రాహుల్‌కు అనధికార రాజకీయ సలహాదారుగా ప్రియాంక‌ పని చేయనున్నట్లు తెలిసింది.

సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా ఇక మీదట కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటారనే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. పార్టీకి సంబంధించిన రాజకీయాలకు సైతం ఆమె దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా ప్రియాంకా ఉండటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమైందని అంటున్నారు. సోనియా గాంధీ ఈ విషయం గురించి లోతుగా ఆలోచించిన అనంతరం ప్రియాంకా గాంధీ సోదరుడు రాహుల్ గాంధీకి అనధికార రాజకీయ సలహాదారుగా పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రియాంకా గాంధీ ఇప్పటికే అమేథీ - రాయబరేలీ లోక్‌ సభ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించటం అందరికీ తెలిసిందే.

పార్టీ అధినేత సోనియా గాంధీ - కాబోయే ర‌థ‌సార‌థి రాహుల్ జాతీయ రాజకీయాల్లో తీరికలేకుండా ఉండటం వలన వారు తమ లోక్‌ సభ నియోజకవర్గాల అభివృద్ధిపై సరైన దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారనే అభిప్రాయంతో ప్రియాంకా గాంధీ ఈ రెండు లోక్‌ సభ నియోజకవర్గాల బాధ్యతలు తన భుజాన వేసుకోవటం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే...కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ సలహా మేరకే ప్రియాంకా గాంధీ సోదరుడు రాహుల్‌ కు అనధికార రాజకీయ సలహాదారుగా పని చేసేందుకు సిద్ధమయ్యారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండ‌గా...కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దాఖలైన 89 నామినేషన్ పత్రాల్లో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరును మాత్రమే ప్రతిపాదించారు. అన్ని నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రధానాధికారి ముల్లపల్లి రామచంద్రన్ ప్రకటించారు. నామినేషన్ పత్రాల దాఖలుకు సోమవారం ఆఖరు రోజు సాయంత్రం మూడు గంటల వరకు దాఖలైన 89 నామినేషన్ పత్రాల్లో కేవలం రాహుల్ గాంధీ పేరు మాత్రమే ఉంది. ఇతర నాయకుల పేరును ఏ ఒక్కరు కూడా ప్రతిపాదించలేదని ఆయన స్పష్టం చేశారు.