Begin typing your search above and press return to search.

అరే.. చిరుకు ఎంత కష్టం వచ్చిందే!

By:  Tupaki Desk   |   6 Feb 2017 5:28 PM IST
అరే.. చిరుకు ఎంత కష్టం వచ్చిందే!
X
రాజ‌కీయాలు.. సినిమాలు రెండు ఎంత భిన్న‌మైన రంగాల‌న్న‌ది మెగాస్టార్ చిరును అడిగితే ఇట్టే చెప్పేస్తారు. సినిమాల త‌ర్వాతి త‌ర్వాతి అడుగు రాజ‌కీయాలుగా చాలామంది చెప్పినా.. చిరుకు మాత్రం అందులో ఏ మాత్రం నిజం లేద‌న్న‌ది న‌మ్ముతారు. రాజ‌కీయాల్లోకి వెళ్లాలంటే డిఫ‌రెంట్ మైండ్ సెట్ ఉండాల‌న్న‌ట్లుగా ఆయ‌న మాట‌లు ఉంటాయి. సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వెంట‌నే.. కోరుకున్న ప‌ద‌వులు.. చేతినిండా అధికారం వ‌స్తుంద‌న్న భావ‌న‌లో చిరు ఉండేవార‌ని చెబుతారు.ఆయ‌న అనుకున్న దానికి భిన్న‌మైన ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టంతో.. డామిట్ క‌థ అడ్డం తిరిగింద‌న్న భావ‌న ఆయ‌న‌లో ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఎద‌వ రాజ‌కీయాల జోలికి వెళ్ల‌కుండా సినిమాల్లో ఉంటే బాగుండేద‌న్న మాట‌ను ఆయ‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర అన్న‌ట్లుగా చెబుతారు కానీ.. అందుకు త‌గ్గ ఆధారాలు చూపించ‌టం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఇదంతా ఒక‌టైతే..తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం చిరును పెద్ద క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డేసింద‌ని చెబుతున్నారు.

దాదాపు ప‌దేళ్లు సినిమాల‌కు దూరంగా ఉండి.. అతిధి పాత్ర‌ల్లో మెరిసిన చిరు..త‌న క‌మ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబ‌రు 150తో ఎంత‌లా చెల‌రేగిపోయారో తెలిసిందే. ఆయ‌నేమాత్రం ఊహించ‌ని రీతిలో రికార్డు క‌లెక్ష‌న్లు రావ‌టంతో పాటు.. చిరు రీఎంట్రీకి ఫ్యాన్స్‌.. సినీ అభిమానులు గ్రాండ్ వెల్ కం చెప్పార‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఖైదీ విజ‌యోత్సాహంలో ఉన్న చిరుకు ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ఐదు రాష్ట్రాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల నేప‌థ్యంలో యూపీలో పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని చిరును రాహుల్ కోరిన‌ట్లుగా తెలుస్తోంది. యూపీలో తెలుగు ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌టం.. ఆయ‌న సినిమా గ్లామ‌ర్ తోపాటు..పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఆయ‌న ఇమేజ్ పార్టీకి లాభంగా మారుతుంద‌న్న మాట‌ను చిరుకు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చిరుకు ఆ ప‌ద‌వి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ మొద‌టి వారం వ‌ర‌కూ ఉండ‌నుంది.

ఈ నేప‌థ్యంలో పార్టీకి సాయం చేయాల‌న్న యువ‌రాజు మాట చిరును డైల‌మాలో ప‌డేసింద‌ని చెబుతున్నారు. గ‌డిచిన కొద్దికాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ.. త‌న ఫోక‌స్ అంతా సినిమాల మీద‌నే పెట్టిన చిరుకు..రాహుల్ ఫోన్ కాల్ ఇబ్బందిగా మారిన‌ట్లు చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. రాహుల్ కాల్ కు త‌న‌స్పంద‌న‌ను తెలియ‌జేయ‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌చారానికి వెళ్లాలా? వ‌ద్దా? అన్న‌ది ఒక ప్ర‌శ్న అయితే.. త‌న ప్ర‌చారం కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌న్న విష‌యంపై చిరుకు సందేహాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. రాహుల్ ఫోన్ కాల్ చిరుకు కొత్త క‌న్ఫ్యూజ్ ను తెచ్చింద‌న్న మాట రాజ‌కీయ వ‌ర్గాల్లోని వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/