Begin typing your search above and press return to search.

ఆ ఒక్కటీ అడగొద్దంటోన్న రాహుల్

By:  Tupaki Desk   |   4 March 2020 11:00 PM IST
ఆ ఒక్కటీ అడగొద్దంటోన్న రాహుల్
X
కాంగ్రెస్ పార్టీతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెహ్రూ దగ్గర నుంచి మొదలుకొని ప్రియాంక గాంధీ వరకు గాంధీ ఫ్యామిలీ లోని ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ అనే గుర్తింపు వచ్చేటట్లుగా పార్టీని ముందుకు నడిపించారు. అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ డీలీ పడిపోయింది. దానికి తోడు తాను అధ్యక్ష పదవిని చేపట్టనంటూ రాహుల్ గాంధీ మొండి పట్టు పట్టడంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీని పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే కొన్ని అనారోగ్య కారణాల తో అంత యాక్టివ్ గా లేని సోనియా మరోసారి పార్టీ ముందుండి నడిపించలేని పరిస్థితి.

పూర్తిస్థాయి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సోనియా విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాలని తన నిర్ణయాన్ని రాహుల్ పున:సమీక్షించుకోవాలని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ రాహుల్ మాత్రం ససేమిరా అంటూ తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఇదే విషయాన్ని తాజాగా రాహుల్ మరోసారి స్పష్టం చేశారు. తాను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం లేదని - ఆ విషయంపై మరోసారి ప్రశ్నించ వద్దని రాహుల్ అన్నట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్ లో తాజాగా క్యాంప్ రాజకీయాలు జోరందుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో సీఎం కమల్ నాథ్ కలవరపడుతున్నారు. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బిజెపి కుట్రపన్నుతోందని ఆరోపించారు ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీని అధ్యక్ష పదవి చేపట్టాలని సీనియర్లు సూచించారట ఈ సమావేశం సందర్భంగా అధ్యక్షపదవి అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మీడియాలో ఒక కథనం ప్రచురితమైంది.

మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఏమాత్రం సుముఖంగా లేరని - గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై అధ్యక్ష పదవి చేపట్టడం పై ఎలాంటి ప్రశ్నలు వేయకూడదని రాహుల్ వాదించినట్టు తెలుస్తోంది. అధ్యక్ష పదవి తన ఉద్దేశం ఏమిటి అనేది గతంలోనే స్పష్టంగా వివరించానని మళ్లీ మళ్లీ అడిగి ఇబ్బంది పెట్టవద్దని రాహుల్ అన్నట్లుగా తెలుస్తోంది . దీంతో, రాహుల్ వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల అన్న తర్వాత గెలుపు ఓటములు సహజం... ఐదు కాదు పది కాదు పదిహేనేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా పుంజుకొని బలంగా అధికారం చేపట్టిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. కానీ రాహుల్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

అయితే నాయకుడు నైతిక స్థైర్యాన్ని కోల్పోతే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందన్న దానికి కాంగ్రెస్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఓటమి భావనకన్నా తమను ముందుండి నడిపించే సరైన నాయకుడు లేడు అనే భావన కాంగ్రెస్ కేడర్ ను, లీడర్లను కలవరపెడుతోంది. అందుకు భిన్నంగా ఉన్న రాహుల్ వ్యవహార శైలి పై రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్న సందర్భంలో. ఇకనైనా కాంగ్రెస్ అధిష్టానం మేల్కొని పార్టీ అధ్యక్షుడు ని నియమించకపోతే ఇటువంటి రాజకీయ సంక్షోభం మరింత ఎదుర్కోవాల్సి రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో సోనియా ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఆ ఒక్కటీ అడగొద్దంటోన్న రాహుల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.