Begin typing your search above and press return to search.

ఎన్నికల తర్వాతే కూటమి సీఎం

By:  Tupaki Desk   |   6 Dec 2018 10:42 AM IST
ఎన్నికల తర్వాతే కూటమి సీఎం
X
" మా లక్ష్యం కల్వకుంట్ల చంద్రశేఖర రావును గద్దె దించడమే. ఆ తర్వాతే మా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో చెడుతాం" ఇవి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాటలు. ఓటింగ్ కు ఒక్క రోజే మిగిలి ఉన్న సందర్భంలో తమ అభ్యర్ధి ఎవరో తేల్చి చెప్పేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారు. ఎన్నికలు ముగిసి ప్ర‌జా కూటమి సంపూర్ణ విజయం సాధించిన తర్వాతే తమ అభ్యర్ధిని ప్రకటిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం కాంగ్రెస్ రాజకీయాల్లో నూతనాధ్యాయంగానే చూడాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి పదవి రేసులో సీనియర్ నాయకులు చాలా మందే ఉంటారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఢిల్లీ నుంచి సీల్డు కవర్ లో పంపుతారనే అపవాదు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ సీనియర్లే కావడంతో ఎవరు.. ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో... మంత్రి అవుతారో.... ఎలాంటి కీలక పదవి పొందుతారో చెప్పడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన అటు కాంగ్రెస్ వర్గాలనే కాకుండానే తెలంగాణ ప్రజలను, రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడిన పార్టీలన్నీ ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసి పని చేస్తాయని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ప్రకటన ద్వారా భవిష్యత్ లో కూడా కూటమి పక్షాల మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందనే సంకేతాన్ని ఇచ్చారాయన అంటున్నారు పరిశీలకులు.

" మహాకూటమి పక్షాల మధ్య మంచి స్నేహపూరిత వాతావరణం ఉంది. భవిష్యత్ లో కూడా ఇది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓటమి పాలవుతారడానికి ఆయన ప్రసంగాలు, ప్రవర్తనే సూచికలు" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నిజానికి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. తమ విజయానికి మహాకూటమి స్నేహం ఒక కారణమైతే... కేంద్రంలో మోదీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కె. చంద్రశేఖర రావు మద్దతు తెలపడం మరో కారణమని రాహుల్ గాంధీ అంచనా వేస్తున్నారు. తెలంగాణలో విజయంతో కేంద్రంలో నరేంద్ర మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడినట్లు అవుతుందని ఆయన అభిప్రాయ పడుతున్నారు. మ‌రి రాహుల్ ఆశ‌లు నెర‌వేరుతాయా?