Begin typing your search above and press return to search.

కన్న‌డ సీఎం ఓకే రాహుల్‌...త‌ర్వాతి సంగ‌తేంటి?

By:  Tupaki Desk   |   15 May 2018 9:54 PM IST
కన్న‌డ సీఎం ఓకే రాహుల్‌...త‌ర్వాతి సంగ‌తేంటి?
X
దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయవ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేకెత్తించిన క‌న్న‌డ ఫ‌లితం వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అనేకమంది అంచ‌నాల‌కు భిన్నంగా బీజేపీ ఇక్క‌డ మెజార్టీ సీట్ల‌ను సాధించింది. అయితే, ఇప్ప‌టికీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే విష‌యంలో ఆ పార్టీకి స్ప‌ష్ట‌త రాలేదు. మ‌రోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ అక్క‌డ రెండో స్థానంలో నిలిచిన‌ప్ప‌టికీ...ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్‌ తో క‌లిసి స‌ర్కారు ఏర్పాటుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం వ‌ల్ల‌ ఈ స‌స్పెన్స్‌ కు తెర‌ప‌డేందుకు మ‌రో వారం రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ ఏం చేయ‌నుంది? త‌మ రెండు పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను చేజార‌కుండా కాపాడుకుంటుందా? అనే సందేహంతోనే...రాబోయే కాలంలో ఆ పార్టీకి పెద్ద ఎత్తున్నే స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌నేది ఖాయ‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. పైగా రాహుల్ ప్ర‌వచించిన `నేనే ప్ర‌ధాని` అనే క‌ల‌ను సాకారం అవుతుందా లేదా తేల‌డంపై ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్తున్నారు.

రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్లేష‌ణ ప్ర‌కారం 2018 ఆ పార్టీ భ‌విష్య‌త్తును నిర్దేశిస్తుంద‌ని చెప్తున్నారు. ఎందుకంటే అస‌లు ప‌రీక్ష 2018లో జ‌రిగే మూడు రాష్ర్టాల ఎన్నిక‌లు అని అంటున్నారు. 520 అసెంబ్లీ సీట్లు క‌లిగిన ఉన్న రాజ‌స్థాన్‌ - మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ - చ‌త్తీస్‌ ఘ‌డ్ ఈ ఏడాదే జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లే పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్ గాంధీ స‌హా కాంగ్రెస్ భ‌విష్య‌త్‌ ను నిర్దేశిస్తాయ‌ని చెప్తున్నారు. ఈ మూడు రాష్ర్టాల్లో మూడూ బీజేపీ పాలిత రాష్ర్టాలు కావ‌డం విశేషం. దీంతో అక్క‌డ కాంగ్రెస్ విజ‌యానికి చెమ‌టోడ్చ‌టం త‌ప్ప‌నిస‌రి. 230 సీట్లుగ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త సానుకూల అవ‌కాశాలే ఉన్నాయ‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్లు దిగ్విజ‌య్‌ సింగ్‌ - జ్యోతిరాధిత్య సిందియా - క‌మ‌ల్ నాథ్ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయ‌డం ఆ పార్టీ విజ‌య‌వ‌కాశాల‌పై భ‌రోసా పెంచేలా ఉంద‌ని చెప్తున్నారు. ఇటీవ‌ల చిత్ర‌కూట్ అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ గెలుపొంద‌డం ఆ పార్టీకి బ‌లం పెరుగుతుంద‌నేందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలాంషు చతుర్వేది 14,100 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా బీజేపీ రెండోస్థానంతో సరిపెట్టుకుంది.

మ‌రో బీజేపీ పాలిత రాష్ట్రమైన చ‌త్తీస్‌ఘ‌డ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఒక్కశాతం ఓటు వాటాతో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ద‌ఫా ఎలాగైన అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్‌ పై ఉన్న వ్య‌తిరేక‌త‌తో పార్టీకి గెలుపు అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. రాజ‌స్థాన్‌ లో సీఎం వ‌సుంధ‌రా రాజే సింధియా నుంచి ఈ దఫా అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌డం అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది. అజ్మీర్ మ‌రియు అల్వార్ లోక్‌ స‌భ స్థానాల‌కు జ‌రిగిన‌ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌డం ఆ పార్టీకి తీపిక‌బురు. ఈ గెలుపుతో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో పార్టీ భ‌విష్య‌త్‌ పై న‌మ్మ‌కం క‌లిగింది.

అయితే ఉప ఎన్నిక‌లు వేరు - అసెంబ్లీ ఎన్నిక‌లు వేర‌నేది తెలిసిన సంగ‌తే. పైగా ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ఆయా రాష్ర్టాల్లోని అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో పాగా వేస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం తాజాగా క‌ర్ణాట‌క‌లో బీజేపీకి ద‌క్కిన సీట్లే. తాజా ఫ‌లితాలే కాంగ్రెస్‌ లో క‌మ్ముకున్న నిరాశ‌కు అద్దం ప‌డుతోంది. కర్ణాటకలో ఓటమితో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం మూగబోయింది. ఆ పార్టీ కార్యకర్తల ముఖాలు వాడిపోయాయి. ఎందుకంటే..కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని రాహుల్ కూడా కాన్ఫిడెంట్‌ గానే కనిపించారు. గెలుపుపై విశ్వాసంతో 2019లో తానే ప్రధాని అవుతా అని కూడా ప్రకటించారు. కానీ అంచనాలు త‌ప్పాయి. ఇప్పుడు అదే ఆత్మ‌విశ్వాసంతో రాబోయే ఎన్నిక‌ల‌కు వెళ్లాలా? లేదా ప్రణాళిక‌బ‌ద్ధంగా పాగా వేయాలా కాంగ్రెస్‌ పార్టీ చేతుల్లో, రాహుల్ వ్యూహాల్లో ఉందంటున్నారు.