Begin typing your search above and press return to search.

రూ.500లకే గ్యాస్ బండ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయొచ్చుగా రాహుల్?

By:  Tupaki Desk   |   6 Sep 2022 5:13 AM GMT
రూ.500లకే గ్యాస్ బండ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయొచ్చుగా రాహుల్?
X
మరికొద్ది నెలల్లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీని ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాన్ స్టాప్ గా ఇప్పటికి నాలుగు దఫాలుగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం.. ఇప్పటికి కమలం పార్టీకి ఆ రాష్ట్రం కంచుకోటగా నిలవటం తెలిసిందే.

ఈసారి జరిగే ఎన్నికల్లో ఎన్ని పరిస్థితుల్లోనూ గుజరాత్ లో బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో అటు కాంగ్రెస్.. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఒక ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే గుజరాత్ లోని రూ.3లక్షల వరకు రైతు రుణాల్ని మాఫీ చేస్తామన్నారు. అంతేకాదు.. గ్యాస్ సిలిండర్ ను రూ.500లకు ఇస్తామన్న ఆఫర్ ను ప్రకటించారు. అంతేకాదు.. బాలికలకు ఉచిత విద్య.. సాధారణ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామన్న  హామీ ఇచ్చారు.

రాహుల్ మాటల్ని ఓకే అనుకుందాం. నిజంగానే కాంగ్రెస్ చేతికి అధికారాన్ని ఇస్తే..  రూ.500లకు గ్యాస్ బండ.. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి నోరూరే ఆఫర్ల సొంతం కావొచ్చని అనుకుందాం. అయితే.. గుజరాత్ లో అయితే కాంగ్రెస్ అధికారంలో లేదు.

కానీ.. రాజస్థాన్ లో ఆ పార్టీ పవర్లోనే ఉంది. ఇప్పుడు రాహుల్ నోటి నుంచి ఏవైతే ఆణిముత్యాల్లాంటి ఆఫర్లు ఉన్నాయో.. ముందు తాము పాలించే రాష్ట్రాల్లో వీటిని ఎందుకు అమలు చేయకూడదు? అన్నది ప్రశ్న.

మాటలు చెప్పే కన్నా.. చేతల్లో చూపించి.. తాము అమలు చేస్తున్నవే.. తాము అధికారంలోకి వచ్చినంతనే అమలు చేస్తామంటూ మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి కదా? మరి.. ఆ పని చేయకుండా ఎన్ని మాటలు చెబితే ఏం లాభం చెప్పండి రాహుల్?




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.