Begin typing your search above and press return to search.

ఈ ఏడాదికి యువరాజుకు పట్టాభిషేకం లేదంట

By:  Tupaki Desk   |   16 March 2015 3:20 PM IST
ఈ ఏడాదికి యువరాజుకు పట్టాభిషేకం లేదంట
X
అమ్మ మీదా.. పార్టీలో పెద్దపీట వేస్తున్న సీనియర్ల మీద అలిగి ఒంటరిగా ఉండేందుకు ఎక్కడికో వెళ్లిపోయిన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పలువురు చర్చించుకుంటున్నారు.

విశ్రాంతి కోసమని కొందరు.. అలగటం వల్ల అని మరికొందరు.. ఇలా మొత్తంగా కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీ సెలవు మీద వెళ్లటం తెలిసిందే. సెలవుకు కారణం అధికారికంగా విశ్రాంతి అని చెప్పినప్పటికీ.. పార్టీ ప్రక్షాళనలో భాగంగానే ఆయన దూరంగా వెళ్లారన్న ప్రచారం జరిగింది.

విశ్రాంతి సమయంలో తనను తాను మరింత శక్తివంతుడిగా తయారు చేసుకొని.. సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తారని ప్రచారం జరుగుతుంటే.. పార్టీ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండే ఒక సీనియర్‌ నేత మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు.

రాహుల్‌ తిరిగి వచ్చిన తర్వాత ఏఐసీసీ సమావేశం జరుగుతుందని.. అందులో పార్టీ పగ్గాలు యువరాజు చేతికి ఇస్తారన్నవాదనలో నిజం లేదని చెప్పేశారు.

అంతేకాదు.. ఏప్రిల్‌ లో అసలు సమావేశమే జరగదంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఈ ఏడాదికి రాహుల్‌ చేతిలో పెట్టేది లేదని తేల్చిన సదరు నేత.. అలాంటిదేమైనా జరిగితే 2016లో జరుగుతుందని వెల్లడించారు. మరో అంశం ఏమిటంటే.. వచ్చే ఏడాది వరకూ తల్లి..కొడుకులు కలిసి పార్టీని నడిపిస్తారని చెబుతున్నారు.