Begin typing your search above and press return to search.

రాహుల్ మొద్ద‌బ్బాయి కాదు....మేధావి!

By:  Tupaki Desk   |   6 Feb 2018 8:00 PM IST
రాహుల్ మొద్ద‌బ్బాయి కాదు....మేధావి!
X
రాహుల్ గాంధీ....ఈ పేరు విన‌గానే కొంద‌రి పెద‌వుల‌పై చిరున‌వ్వు చిగురిస్తుంది. ముఖ్యంగా ప్ర‌తిపక్షాలు....రాహుల్ ను మొద్ద‌బ్బాయి అంటూ ఎద్దేవా చేసిన ఘ‌ట‌నలు కూడా ఉన్నాయి. అయితే, రాహుల్ ప్ర‌సంగాల‌లో దొర్లిన త‌ప్పులు, ఆయ‌న మాట్లాడే విధానం....ఇటువంటి అనేక కార‌ణాల వ‌ల్ల రాహుల్ చెప్పే విష‌యం ప‌క్క‌దోవ ప‌ట్టి.....స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగం ర‌సాభాస అయ్యేది. వాస్త‌వానికి రాహుల్.....అధికార బీజేపీపై లేవ‌నెత్తే అంశాలు విలువైన‌వే అయిన‌ప్ప‌టికీ.....ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న‌పై వేసిన మొద్ద‌బ్బాయ్ ముద్ర ఆ అంశాల‌ను మ‌రుగున‌ప‌డేసింది. వాస్తవానికి రాహుల్ కు మోదీకి ఉన్నంత వాగ్ధాటి - హాస్య చతుర‌త‌ - చ‌మ‌త్కార ధోర‌ణి లేవు. కానీ, రాహుల్ కు ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై - బీజేపీ లోప‌భూయిష్ట విధానాలపై అవ‌గాహ‌న ఉందని చెప్ప‌వ‌చ్చు. వివిధ సంద‌ర్భాల‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ప్ర‌సంగాల‌లో 8 ముఖ్య‌మైన అంశాలను ఒక సారి ప‌రిశీలిస్తే ఆయ‌న‌కు ఉన్న రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త గురించి ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఇక, కొద్ది రోజు క్రితం ఏఐసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత రాహుల్ త‌న ప్ర‌సంగాల ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త వ‌హించ‌డంతో భవిష్య‌త్ ప్ర‌ధాని రేసులో రాహుల్ ప‌రిగెడుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

2016లో ప్ర‌ధాని మోదీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన నోట్ల ర‌ద్దుపై రాహుల్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మోదీ అనాలోచిత‌ - ఏక‌ప‌క్ష నిర్ణ‌యం వ‌ల్ల దేశంలోని పేద‌ - మ‌ధ్య త‌ర‌గ‌తి వారు - చిరు వ్యాపారులు రోడ్డున ప‌డ్డార‌ని, 100 మందికి పైగా అమాయ‌కులు బ‌ల‌య్యార‌ని దుయ్య‌బ‌ట్టారు. నోట్ల‌ర‌ద్దు - జీఎస్టీ వ‌ల్ల భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ఐసీయూలో ఉంద‌ని, ఆ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌రిచేసేందుకు బీజేపీ స‌ర్కార్ వేస్తున్న‌ మందులో ద‌మ్ములేద‌ని కొద్దిరోజుల క్రితం జైట్లీని ఉద్దేశించి రాహుల్ చేసిన‌ ట్వీట్ వైర‌ల్ అయింది.

కాంగ్రెస్ ప‌రిభాషలో జీఎస్టీ అంటే గూడ్స్ సింపుల్ ట్యాక్స్ అని.....కానీ, మోదీ జీఎస్టీ అంటే గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్ అని.....ప్ర‌జ‌ల సంపాద‌నంతా త‌న‌కు ఇవ్వ‌మ‌ని మోదీ అడుగుతున్నార‌ని..... రాహుల్ వేసిన సెటైర్లు బాగానే పేలాయి. జీఎస్టీ వ‌ల్ల చిరువ్యాపారులు వీధుల‌పాల‌య్యార‌ని, దేశానికి చాలా న‌ష్టం జ‌రిగిందని దుయ్య‌బ‌ట్టారు.

మేక్ ఇన్ ఇండియా - డిజిట‌ల్ ఇండియా అంటూ ర‌క‌ర‌కాల ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన మోదీ....దేశంలో నిరుద్యోగం పార‌ద్రోల‌డానికి ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని రాహుల్ అన్నారు. రోజుకు దాదాపు 30 వేల ఉద్యోగాలు క‌ల్పించాల్సి ఉంటే....స‌ర్కార్ కేవ‌లం 500 ఉద్యోగాల‌ను క‌ల్పిస్తోంద‌న్నారు.

మ‌హిళా సాధికార‌త గురించి మోదీ స‌ర్కార్ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతోందని, కానీ ఆర్ ఎస్ ఎస్ లో ఒక్క‌ మ‌హిళ‌కు కూడా స్థానం లేద‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లు ఆమోదం పొందేవ‌ర‌కు పోరాడ‌తామ‌ని ఓ స‌భ‌లో రాహుల్ చెప్పారు.

బీజేపీ హ‌యాంలో భార‌త్ లో నానాటికీ అస‌హ‌నం పెరిగిపోతోంద‌ని, కొంత‌మంది అన్న‌ద‌మ్ములలా క‌లిసుండే భార‌తీయుల మ‌ధ్య మ‌తం పేరుతో చిచ్చు పెట్టాల‌ని చూస్తున్నారని రాహుల్ అమెరికాలో అన్నారు. ఇటువంటి చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త్ ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లుగుతోంద‌ని రాహుల్ అన్నారు.

త‌మ పంట‌ల‌కు ప్ర‌భుత్వం గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మ‌వుతోందని, దానికి తోడు వ‌ర్షాలు లేక పంట‌లు ఎండిపోయి రైతులు అప్పుల‌పాల‌వుతున్నార‌ని మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా రాహుల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మోదీ `సూట్ బూట్ స‌ర్కార్`...రైతుల‌కు ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌ని ఎద్దేవా చేశారు. నానాటికీ పెరిగిపోతోన్న రైతుల ఆత్మ‌హ్య‌ల‌ను నివారించేందుకు మోదీ స‌ర్కార్ ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌న్నారు.

గుజ‌రాత్ ను డెవ‌ల‌ప్ చేసిన విధంగానే దేశాన్ని డెవ‌ల‌ప్ చేస్తార‌ని మోదీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని, అయితే, అది కేవలం ఆక‌ర్ష‌ణ కోసం పెట్టిన ఒక బెలూన్ వంటిద‌ని, లోప‌ల అంతా డొల్లేన‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. కేవ‌లం అంబానీలు, టాటాలు, అదానీల వంటి బ‌డాబాబుల జేబులు నింప‌డానికే మోదీ....వేల ఎక‌రాల భూముల‌ను రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నార‌ని విరుచుకుప‌డ్డారు.

మోదీ సంయుక్త‌ ప్ర‌భుత్వంలో జ‌మ్మూ క‌శ్మీర్ లో ద్వేష‌పూరిత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని, తాము ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డి క‌శ్మీరు లోయ‌లో శాంతిని స్థాపించామ‌ని రాహుల్ అన్నారు. హింసకు తాను వ్య‌తిరేక‌మ‌ని, త‌న నాయ‌న‌మ్మ‌, తండ్రుల‌ను హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌లో కోల్పోయాన‌ని....త‌న‌కుంటే హింస అనే ప‌దాన్ని ఎవ‌రు బాగా అర్థం చేసుకుంటార‌ని రాహుల్ భావోద్వేగంతో చేసిన ప్ర‌సంగం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.