Begin typing your search above and press return to search.

దేశం ఉన్నది ఆ 15 మంది కోసమేనా...?

By:  Tupaki Desk   |   4 Oct 2019 6:00 PM IST
దేశం ఉన్నది ఆ 15 మంది కోసమేనా...?
X
దేశంలో అసహనం పెరిగిపోతుందని లెటర్ రాసిన 50 మందిపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు - వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మన దేశం మొత్తం నియంత పాలనలోకి వెళ్ళిపోతుందని - ఇది అందరూ చూస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎవరు ఎదురు మాట్లాడినా కేసులు పెట్టి జైళ్ళకి పంపుతున్నారని రాహుల్ విమర్శించారు. ప్రస్తుతం మన దేశంలో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారని - ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాహుల్ చెప్పారు.

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని - దీనికి కారణం మోడీ అనుసరిస్తున్న విధానాలే. దీనికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థను మోడీ తీవ్రంగా దెబ్బ తీశారని - జీడీపీ వృద్ధి రేటు ఎక్కడా లైటు వేసి వెతికినా కనిపించట్లేదని విరుచుకుపడ్డారు. కేరళలో ప్రజలు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులు కోసం ఆశగా ఎదురు చూస్తుంటే మోడీ మాత్రం దేశంలో ఉన్న 15 మంది పారిశ్రామిక వేత్తలకు 1,25,000 కోట్లు పన్ను రాయితీలు కల్పించారంటూ తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఆ 15 మందే ఉండాలా...? మిగిలిన ప్రజల కష్టాల గురించి బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదా...? అని ప్రశ్నించారు.