Begin typing your search above and press return to search.

మోడీకి రాహుల్ హ‌గ్ వెనుక అస‌లు క‌థ ఇదేన‌ట‌!

By:  Tupaki Desk   |   25 July 2018 2:21 PM IST
మోడీకి రాహుల్ హ‌గ్ వెనుక అస‌లు క‌థ ఇదేన‌ట‌!
X
మోడీ స‌ర్కారుపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హ‌గ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అవిశ్వాసంపై జ‌రిగిన చ‌ర్చ‌కు మించిన సంచ‌ల‌నం హ‌గ్ తో మొద‌లైంది. దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌ట‌మే కాదు.. ప‌క్క‌రోజు ప‌త్రిక‌ల‌న్నీ ఈ హ‌గ్ కే అమిత ప్రాధాన్యాన్ని ఇవ్వ‌టం క‌నిపించింది.

మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన రాహుల్ హ‌గ్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ముందుగా అనుకున్న దాని ప్ర‌కార‌మే రాహుల్ ప్ర‌ధానిని హ‌గ్ చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కీ మోడీకి హ‌గ్ చేసుకోవాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింద‌న్న దాని వెనుక పెద్ద క‌థే ఉందంటున్నారు.

కొద్ది నెల‌ల క్రితం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ త‌న ప్ర‌సంగంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ తో పాటు.. ఆయ‌న త‌ల్లి సోనియాగాంధీతో పాటు.. వారి కుటుంబంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ స‌మ‌యంలోనే మోడీకి హ‌గ్ ఇవ్వాల‌ని రాహుల్ భావించార‌ట‌. మోడీ చేసే విమ‌ర్శ‌ల‌కు ధీటుగా త‌న హ‌గ్ ఉంటుంద‌ని ఆయ‌న భావించిన‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌ధాని మోడీకి కౌంట‌ర్ ఇవ్వాలంటే.. ఆయ‌న‌పై తాను ప్రేమ చూపించ‌ట‌మే స‌రిపోతుంద‌ని భావించిన రాహుల్‌.. అందుకు త‌గిన వేదిక కోసం వెయిట్ చేశార‌ట‌. అవిశ్వాసంపై జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా ఈ అవ‌కాశం ల‌భించింద‌ని.. దాన్ని రాహుల్ స‌ద్వినియోగం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

మోడీ విమ‌ర్శ‌ల‌కు త‌గిన స‌మాధానం ఇచ్చేందుకు కౌగిలింత విష‌యాన్ని పార్టీ వ‌ర్గాల‌కు తెలియ‌జేసిన‌ట్లుగా తెలుస్తోంది. త‌న హ‌గ్ కు ముందు.. ప్ర‌ధాని మోడీపై త‌న‌కు ఎలాంటి ద్వేషం లేద‌న్న విష‌యాన్ని రాహుల్ స్ప‌ష్టం చేయ‌టాన్ని గుర్తు చేస్తున్నారు. తాజాగా బ‌య‌ట‌కొస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. రాహుల్ హ‌గ్ ప‌క్కా ప్లాన్ త‌ప్పించి.. అప్ప‌టిక‌ప్పుడు అసంక‌ల్పంగా తీసుకున్న నిర్ణ‌యం ఎంత‌మాత్రం కాద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది.