Begin typing your search above and press return to search.

రాహుల్ కు షాకిచ్చిన లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్‌!

By:  Tupaki Desk   |   11 Jun 2019 1:58 PM IST
రాహుల్ కు షాకిచ్చిన లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్‌!
X
కొన్ని త‌ప్పులు అస్స‌లు జ‌ర‌గ‌కూడ‌దు. అందునా కీల‌క స్థానాల్లో ఉన్న వారిలో పొర‌పాటు దొర్ల‌టం అంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిట‌న్న సందేహం క‌లుగ‌క మాన‌దు. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు క‌మ్ ఎంపీ రాహుల్ గాంధీ విష‌యంలో లోక్ స‌భ స‌చివాల‌యం జారీ చేసిన ఒక సర్య్కుల‌ర్ చేసిన త‌ప్పు ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

తాజాగా ముగిసిన ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొత్త‌గా ఎన్నికైన ఎంపీల‌కు సంబంధించిన ఖాళీగా ఉన్న బంగ్లాల జాబితాను విడుద‌ల చేసింది.

అందులో 12 - తుగ్ల‌క్ లేన్ ఇల్లు కూడా ఉండ‌దు.ఇంత‌కీ ఆ ఇల్లు ఎవ‌రిదంటారా? ఇంకెవ‌రిది కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నివాసం. ఆయ‌న ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఆయ‌న అదే నివాసంలో ఉంటున్నారు. తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో అమేధీలో ఓట‌మిపాలైన‌ప్ప‌టికి.. కేర‌ళ‌లోని వ‌య‌నాడు ఎంపీ స్థానం నుంచి బంప‌ర్ మెజార్టీతో గెలుపొందారు రాహుల్. అలాంట‌ప్పుడు రాహుల్ అధికారిక నివాసాన్ని ఖాళీ అని చూపించే అవ‌కాశం లేదు.

మ‌రి ఏమైందో కానీ..రాహుల్ నివాసం ఖాళీ అంటూ ప్ర‌క‌టించిన జాబితాలో ఉండ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ అని చెప్ప‌టం ద్వారా లోక్ స‌భ స‌చివాల‌యం ప‌ని తీరు ఎంత నిర్ల‌క్ష్యంగా ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

రాహుల్ నివాసం ఉండే బంగ్లా టైప్ 8 కేట‌గిరికి చెందిన‌ది. ఇది ఖ‌రీదైన అతి పెద్ద బంగ్లాగా చెబుతుంటారు. ఈ కేట‌గిరిలో వీవీఐపీలు.. కేబినెట్ లో మంత్రులకు మాత్ర‌మే నివ‌సించే అర్హ‌త ఉంటుంది. అమేధీలో ఓడినా.. వ‌యునాడులో గెలిచిన విష‌యాన్ని అధికారులు ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. చూస్తుంటే.. రాహుల్ బంగ్లాను ఖాళీ చేయించాల‌ని ఫిక్స్ అయ్యారా ఏంటి? అన్న‌దిప్పుడు డౌట్ గా మారింది. ఏమైనా జాబితాలో తాను నివాసం ఉండే ఇంటిని చేర్చ‌టంపై రాహుల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.