Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీకే ఫుల్ మెజారిటీ

By:  Tupaki Desk   |   23 May 2022 6:21 AM GMT
ఆ రాష్ట్రంలో రాహుల్ గాంధీకే ఫుల్ మెజారిటీ
X
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఐఏఎన్ఎస్ - సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ ప్రధానిగా ఎవరు ఉంటే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ అయితే బాగుంటుందని ఏకం 54 శాతం మంది ప్రజలు చెప్పడం విశేషం. ఇక ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ప్రధానిగా కోరుకున్నవారు కేవలం 24 శాతం మందే కావడం గమనార్హం. అయితే ఈ వివరాలు.. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనివే.

గతేడాది (2021)లో ఎన్నికైన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఇండో ఏసియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్ఎస్) - సి ఓటర్ తాజా సర్వే నిర్వహించాయి. ఇందులో దక్షిణ భారతదేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. గతేడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన అస్సాం, కేరళ, తమిళ నాడు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాల పనితీరుపై సర్వే నిర్వహించారు. వీటి అన్నిటిలోకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటారు. ఏకంగా 85 శాతం మంది ప్రజలు స్టాలిన్ పనితీరుకు అనుకూలంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ప్రధానమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుందని అనే ప్రశ్నకు రాహుల్ గాంధీకి 54 శాతం మంది పట్టం కట్టడం విశేషం.

మోడీ పని తీరు బాగుందని కేవలం 17 శాతం మంది మాత్రమే ఒప్పుకున్నారు. 40 శాతం మంది ఆయన పని తీరు బాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో 40 శాతం మంది మోడీ పని తీరు ఫర్వాలేదని పేర్కొన్నారు. మొత్తం మీద సర్వే దక్షిణ భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని తేల్చింది. మొదటి నుంచి దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంత సీన్ లేదు. సీ ఓటర్ సర్వే కూడా ఇదే తేల్చడం గమనార్హం.

కాగా రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీగా ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని అమేథీలో ఓడిన రాహుల్ వయనాడులో మాత్రం ఘనవిజయం సాధించారు.

ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో కాంగ్రెస్ పార్టీ చింతన్ బైటక్ నిర్వహించింది. వచ్చే నెల యువతకు పెద్ద పీట వేయడం, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో 90 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.