Begin typing your search above and press return to search.

అటు శత్రువు.. ఇటు మిత్రులు.. రాహుల్ టార్గెటేంటి?

By:  Tupaki Desk   |   31 Dec 2018 7:47 AM GMT
అటు శత్రువు.. ఇటు మిత్రులు.. రాహుల్ టార్గెటేంటి?
X
ఒకటే ప్రత్యర్థి.. ఆయనే మోడీ.. మోడీని ఓడిస్తే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. కానీ ఒకవేళ మెజార్టీ తగ్గితే.. మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి.. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ రెండు టార్గెట్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్నారట..

కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వేళ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకోవడం బీజేపీని కలవరపెట్టాయి.మాయవతి- మమత- అఖిలేష్ లు సోనియాతో ఆప్యాయంగా మాట్లాడారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కేసీఆర్ ఎప్పుడైతే ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరగడం మొదలుపెట్టారో అప్పుడే కాంగ్రెస్ మిత్రుల్లో చీలిక వచ్చింది. రాహుల్ ప్రధానమంత్రిగా ఒప్పుకోని మమత- మాయవతి- అఖిలేష్ యాదవ్ లు ఈ ఫెడరల్ ఫ్రంట్ వైపు చూస్తున్నారు. అఖిలేష్ యాదవ్ అయితే జనవరి 6 తర్వాత హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటి అవుతానని ప్రకటించారు. ఫ్రంట్ ను స్వాగతిస్తానని చెప్పుకొచ్చారు..

తాజాగా సీపీఐ(ఎం) కూడా ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని గెలిచాక చూసుకుందామని... ముందు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని ఆదివారం ఢిల్లీలో ప్రకటించారు.

ఇక మాయవతి , మమత కూడా చాన్స్ వస్తే తామే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటామని.. రాహుల్ ను ప్రధానిగా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అంతటా ఆసక్తి నెలకొంది. రాహుల్ గాంధీ బలమైన బీజేపీ మోడీని ఓడించడంతో పాటు మిత్రపక్షాల మద్దతు కూడగడితేనే ప్రధాని కాగలరు. ఏమాత్రం తేడా వచ్చినా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మద్దతిచ్చి ప్రధాని అయ్యేందుకు మమత- మాయావతి- అఖిలేష్ లాంటి వాళ్లు కాచుకు కూర్చున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను బుజ్జగించే పనులకు సన్నద్ధమవుతోందట..