Begin typing your search above and press return to search.

మోడీ వైఫల్యాన్ని కడిగిపారేసిన రాహుల్

By:  Tupaki Desk   |   1 May 2022 11:00 AM IST
మోడీ వైఫల్యాన్ని కడిగిపారేసిన రాహుల్
X
టైమ్లీగా సంధించే అస్త్రాలు ఎంత వాడివేడిగా ఉంటాయో తెలిసిందే. రాజకీయంలో సమయానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గతంతో పోలిస్తే మోడీ సర్కారుపై రాహుల్ గురి మరింత పెరిగింది. తాజాగా దేశంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై రాహుల్ గళం విప్పారు. విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటన్న ప్రశ్నను సంధించటమే కాదు.. సమస్య ఏమొచ్చినా నెహ్రూ హయాంను వేలెత్తి చూపిస్తున్న వైనాన్ని గుర్తు చేసే మోడీ అండ్ కో ప్రాక్టీస్ ను వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ.. 'ఈ విద్యుత్ సంక్షోభంలో మీ వైఫల్యానికి ఎవరిని నిందిస్తారు? మాజీ ప్రధాని నెహ్రూనా? రాష్ట్ర ప్రభుత్వాలనా? దేశ ప్రజలనా?' అంటూ చురకలు వేశారు.

దాదాపు ఏడేళ్ల క్రితం అంటే 2015లో మాట్లాడిన నరేంద్ర మోడీ.. 2002 నాటికి దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ ను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్న విషయాన్ని రాహుల్ ప్రస్తావించారు. అంతేకాదు.. 2017లో కూడా ఇదే తరహా వ్యాఖ్యల్ని చేసిన నరేంద్ర మోడీ ప్రసంగ వీడియో క్లిప్ లను పోస్టు చేస్తూ.. మోడీ సర్కారును తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రధాని గాల్లో కట్టిన మేడలు ఎగిరిపోయాయని.. విద్వేషపు బుల్డోజర్లు నడపటం ఆపి.. విద్యుత్ కర్మాగారాలు పని చేసేలా చూడాలని హితవు పలికారు. రోటీన్ కు భిన్నంగా కాస్త ఘాటుగా.. కేంద్రం ఆత్మరక్షణలో పడేలా ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పకతప్పదు. ఇంతకూ దేశంలో అంత తీవ్రంగా విద్యుత్ సంక్షోభం నెలకొందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది.

గతానికి కాస్త భిన్నంగా ఏప్రిల్ లో భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో విద్యుత్ వినియోగం ఎక్కువైంది. దీనికి తోడు బొగ్గు రవాణా విషయంలో చోటు చేసుకున్న తేడా ఈ రోజున విద్యుత్ సంక్షోభానికి కారణంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. ఉత్తరప్రదేశ్.. పంజాబ్.. మహారాష్ట్ర.. హరియాణ.. తమిళనాడు.. ఏపీ తదితర రాష్ట్రాల్లో కరెంటు కోతలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు దేశంలోని పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ప్రధాన వనరుగా ఉండే బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయన్న ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో బొగ్గు రవాణాను మరింత వేగవంతం చేసేందుకు పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు వినియోగించే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి.. వాటి స్థానే బొగ్గు లోడ్లతోఉండే గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యతను ఇస్తున్న వైనం తెలిసిందే. కేంద్రం తీరును పలువురు తప్పు పడుతున్నారు.

విద్యుత్ సంక్షోభాన్ని మోడీ సర్కారు ముందుగా గుర్తించటంలో విఫలం చెందిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రయాణికులు ప్రయాణించే రైళ్లను రద్దు చేసి.. బొగ్గు లోడ్లతోఉన్న గూడ్స్ రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వటంపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రియాక్టు అవుతూ.. గొప్ప పరిష్కారం వెతికారంటూ వ్యంగ్యస్త్రాన్ని సంధించారు. నిజమే కదా.