Begin typing your search above and press return to search.

ఎమర్జెన్సీపై చెంపలు వేసుకుంటూ రాహుల్ సంచలన వ్యాఖ్య

By:  Tupaki Desk   |   3 March 2021 4:30 AM GMT
ఎమర్జెన్సీపై చెంపలు వేసుకుంటూ రాహుల్ సంచలన వ్యాఖ్య
X
దాదాపు 45 ఏళ్ల క్రితం చేసిన తప్పునకు కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు.. గాంధీ కుటుంబ రాజకీయ వారసుడిగా అభివర్ణించే రాహుల్ గాంధీ చెంపలు వేసుకున్నారు. 1975లో అప్పటి ఇందిర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ నిర్ణయంపై ఇప్పటికి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంటోంది. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కానీ.. గాంధీ కుటుంబ సభ్యులు కానీ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. జరిగిన తప్పును తప్పుగా ఒప్పుకునే సాహసం చేయలేదు. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు.

అత్యవసర స్థితిని విధించటం తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. జరిగింది పొరపాటేనని.. కచ్ఛితంగా తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఇలాంటి ప్రకటన ఇప్పుడు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ ఎంతగానో జరిగిపోయిందని చెబుతున్నారు. తాజాగా చేసిన వ్యాఖ్య కూడా మోడీ సర్కారుపై విమర్శలు చేసే క్రమంలోనే తప్పించి.. తన నానమ్మ తీసుకున్న దారుణ నిర్ణయంపై పశ్చాతాపం రాహుల్ మాటల్లో కనిపించటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.

అయితే.. ఇప్పటికైనా ఇందిరమ్మ తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయాన్ని తప్పుగా చెప్పి.. చెంపలు వేసుకునే సాహసం రాహుల్ చేయటాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు. సగటు కాంగ్రెస్ నేతల తీరుకు భిన్నంగా రాహుల్ మాటలు ఉన్నాయని.. ఆయన మాటల్ని స్వాగతించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ ఈ సంచలన వ్యాఖ్యల్ని రాహుల్ ఎక్కడ చేశారు? ఎందుకు చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

కార్నెల్ వర్సిటీ ప్రొఫెసర్.. భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బసుతో సంభాషణ జరిపిన సందర్భంగా రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అప్పుడు జరిగింది పొరపాటే. కచ్ఛితంగా అది తప్పే అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే అప్పుడున్న పరిస్థితి మౌలికంగా వేరైనది. కాంగ్రెస్ ఏ సమయంలోనూ దేశ మౌలిక వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం చేయలేదు’ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీగా అభివర్ణించిన రాహుల్.. సమానత్వం కోసం నిలిచిన పార్టీగా చెప్పుకున్నారు. అదే సమయంలో మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. దేశ వ్యవస్థీకృత విధి విధానాలను మార్చే ప్రయత్నం.. వ్యవస్థలను ఆక్రమించే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు ఆ శక్తి కూడా లేదన్నారు. తమ పార్టీ రూపుదిద్దుకున్న విధానం కూడా అందుకు అంగీకరించదన్న రాహుల్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాకుంటే.. ఎమర్జెన్సీపై రాహుల్ తాజా ప్రకటన చాలా ఆలస్యమైందని.. ఇంతకుముందే ఇలాంటి వ్యాఖ్య చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.