Begin typing your search above and press return to search.

రాహుల్ కూడా బీకాంలో ఫిజిక్స్ చదివిన బ్యాచేనట

By:  Tupaki Desk   |   2 March 2017 12:28 PM IST
రాహుల్ కూడా బీకాంలో ఫిజిక్స్ చదివిన బ్యాచేనట
X
ఇప్పుడు పరిస్థితులు చాలానే మారిపోయాయి. గతంలోలా లేదు. నోటి నుంచి మాట వచ్చిన మరుక్షణం.. జనసామ్యం తన రియాక్షన్ ను.. సోషల్ మీడియా ద్వారా చెప్పేస్తున్నారు. గతంలో నేతల నోటి నుంచి వచ్చిన మాటలు కాస్త ఎక్కువ తక్కువైనా.. కవర్ చేసుకునే అవకాశం ఉండేది. డిజిటల్ ప్రపంచంలో ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రతిఒక్కరి చేతిలోమొబైల్ ఫోన్లు వచ్చేయటం.. అందులో కెమేరాకు ప్రతిఒక్కరూపని చెప్పటం.. కాస్త తేడా కొడితే చాలు.. సోషల్ మీడియాతో తాట తీసేస్తున్నారు. దీంతో.. కొందరు ప్రముఖులకు తాజా పరిణామాలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి.

ఫార్టీ ప్లస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా.. అమూల్ బేబీ మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇమేజ్ ఈ మధ్యన దారుణంగా దెబ్బ తింటోంది. అవగాహన లేకుండా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అన్ని విషయాల మీద అందరికి అవగాహన ఉండదనటంలో మరో మాట లేదు. కాకుంటే.. బంగాళ దుంపలు ఫ్యాక్టరీల్లో తయారవుతాయని.. కొబ్బరిబొండాం నుంచి జ్యూస్ వస్తుందనే సరికొత్త విషయాలు మాత్రం రాహుల్ నోటి నుంచి మాత్రమే వస్తాయని చెప్పాలి.

ఆ మధ్య ఏపీ టీడీపీకి చెందిన నేత.. తాను బీకాంలో ఫిజిక్స్ చదివినట్లుగా చెప్పిన వైనాన్ని గుర్తుకు తెచ్చేలా రాహుల్ గాంధీ మాటలు ఈ మధ్యన ఉంటున్నాయి. రైతుల గురించి.. రైతుల కష్టాల గురించి తరచూ గొంతు విప్పే ఆయనకు.. రైతుల గురించి.. వ్యవసాయం గురించి ఎంత అవగాహన ఉందన్న విషయం ఈ మధ్యన ఆయన మాట్లాడే మాటల్ని చూస్తే ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. వ్యవసాయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కామెడీ కామెడీగా మారాయి. ఆ మధ్య యూపీలోని మురాద్ నగర్ లో నిర్వహించిన సభలో మాట్లాడిన రాహుల్.. లక్నోలో మామిడిపండ్లు ఎలా తయారవుతాయో వివరించారు. అంతేకాదు.. బంగాళదుంపలకు ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పిన ఆయన మాటలతో.. బంగాళదుంపలు.. మామిడిపండ్లను ఫ్యాక్టరీలో తయారు చేయటం ఎప్పటి నుంచి మొదలెట్టారంటూ నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది.

ఈ కామెడీ మాటలపై సోషల్ మీడియాలో రాహుల్ ను ఎంత ఎటకారం చేసుకోవాలో.. అంత ఎటకారం చేసేసుకుంటున్నారు. ఇటీవల మణిపూర్ లో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా.. కొబ్బరికాయల నుంచి జ్యూస్ తీసి.. ఆ జ్యూస్ ను లండన్ లో అమ్ముతానని వ్యాఖ్యానించటం రాహుల్ అవగాహనారాహిత్యానికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ఛాన్స్ ల్ని ఏ మాత్రం వదలని ప్రధాని మోడీ.. రాహుల్ మాటల్ని ప్రస్తావిస్తూ.. ‘‘కొందరు కాంగ్రెస్ నేతలకు కొబ్బరకాయల నుంచి జ్యూస్ వస్తుందట. కొబ్బరిబొండాలనుంచి నీళ్లు వస్తాయే కానీ జ్యూస్ కాదన్నది చిన్నపిల్లాడికి కూడా తెలుసు. కానీ.. కాంగ్రెస్ నేతలకు మాత్రం తెలీటం లేదే’’ అంటూ చురకలు అంటించారు. రాహుల్ యవ్వారం చూసినోళ్లంతా.. కాంగ్రెస్ యువరాజు కూడా.. ‘బీకాంలో ఫిజిక్స్’ చదివిన బ్యాచేనన్న మాట అంటూ కామెడీ చేసేసుకుంటున్న పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/