Begin typing your search above and press return to search.

వార్ రూమ్‌ లోకి రాహుల్‌ కు ఎంట్రీ లేదంతే!

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:01 PM IST
వార్ రూమ్‌ లోకి రాహుల్‌ కు ఎంట్రీ లేదంతే!
X
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అస‌మ‌ర్థ‌త మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది. ఏఐసీసీ కో ఆర్డినేషన్ కమిటీ స‌భ్యుడు ఆశిష్‌ ను రాహుల్ నిల‌బెట్టుకోలేక పోయారు. కాంగ్రెస్ వార్ రూమ్‌ లో కీలక వ్యక్తి అయిన ఆశిష్‌.. గ‌త కొంత కాలంగా రాహుల్ స‌హా కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. ముఖ్యంగా ప‌లు రాష్ట్రాల్లో అధికారం అంచుల దాకా వ‌చ్చి పార్టీ చ‌తికిల ప‌డ‌డంపై ఆయ‌న గ‌తంలోనే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాట‌ల‌కు ఎవ‌రూ పెద్ద‌గా విలువ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న ఆక‌స్మికంగా కాంగ్రెస్ నుంచి నిష్క్ర‌మించారు. ఈ సంద‌ర్భంగా వెళ్తూ వెళ్తూ.. ఆయ‌న రాహుల్‌ ను కేంద్రంగా చేసుకుని క‌డిగిపారేశారు.

అవ‌టానికి కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా.. నిర్వ‌హ‌ణ ఆ స్థాయిలో లేద‌ని ఆశిష్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. దేశ వ్యాప్తంగా పార్టీ అన్ని విధాలా చ‌తికిల ప‌డిపోయింద‌ని అన్నారు. పార్టీ వ్యవహారాల నిర్వహణ పూర్తిగా తప్పుదోవలో నడుస్తోందన్నారు. ఈ పరిస్థితి పరిపాలనాపరమైన నష్టాలు - రాజకీయ వైఫల్యాలకు దారి తీసిందన్నారు. అంతేకాకుండా న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర - అస్సాం - గోవా - ఉత్తరాఖండ్ - అరుణాచల్ ప్రదేశ్‌ లలో కాంగ్రెస్ నిలకడ లేకుండా వ్యవహరించిందని, ఫలితంగా ఆ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైందని నిక్క‌చ్చిగా చెప్పారు.

ఇదే వ్యవహారశైలిని గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్‌ లలో కూడా కొనసాగిస్తున్నారని నిర్మొహ‌మాటంగా తెలిపారు. పార్టీలో గ్రూపులు విపరీతంగా పెరగడంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ క్రమ శిక్ష‌ణ రాహిత్యం బ‌య‌ట‌ప‌డుతోంద‌ని చెప్పారు. కాంగ్రెస్‌ కు జీవ‌నాడి అయిన మ‌ధ్యేవాదాన్ని ప‌క్క‌న పెట్టార‌ని, వామ‌ప‌క్షాలతో స్నేహం చేస్తూ.. వారి వాదాన్ని భుజాన వేసుకుంటున్నార‌ని ఆశిష్ దుయ్య‌బ‌ట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ మరొక హిందూ వ్యతిరేక పార్టీలా భావించబడుతోందన్నారు. కమ్యూనిస్టులు - తృణమూల్ కాంగ్రెస్ - ఇతర వామపక్ష సంస్థల మాదిరిగా కాంగ్రెస్ మారిందని ఆశిష్‌ ఆరోపించారు. మొత్తానికి దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని చెప్ప‌డానికి ఆశిష్ లేఖ ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. గుజ‌రాత్‌ కి చెందిన శంక‌ర్ సింగ్ వాఘేలా కూడా ఇటీవ‌ల కాంగ్రెస్‌ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం గ‌మ‌నార్హం.