Begin typing your search above and press return to search.

యువ‌రాజు స‌భ‌కు మంచాలు వేశారు

By:  Tupaki Desk   |   6 Sept 2016 3:22 PM IST
యువ‌రాజు స‌భ‌కు మంచాలు వేశారు
X
ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. మేం చెబుతున్న‌ది నిజ‌మే. కామెడీ కోస‌మే.. ట్విస్ట్ చేయ‌టానికో హెడ్డింగ్ పెట్ట‌లేదు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు.. ఆ పార్టీకి యువ‌రాజు లాంటి రాహుల్ గాంధీ పెద్ద కార్య‌క్ర‌మాన్నే చేప‌ట్టారు. కొద్దినెల‌ల్లో జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లకు సంబంధించి ప్రచారం చేసేందుకు భారీ ఏర్పాట్లే చేసుకున్నారు. మిగిలిన పార్టీల కంటే ముందు ఉండాల‌న్న ల‌క్ష్యంతో అంద‌రికంటే ముందుగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టారు.

దాదాపు నెల రోజుల పాటు సాగే సుదీర్ఘ‌మైన మ‌హాయాత్ర‌ను తాజాగా తెర తీశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి యూపీలోని 223 నియోజ‌క‌వ‌ర్గాలు క‌వ‌ర్ అయ్యేలా 2500 కిలోమీట‌ర్ల‌తో ఓ భారీ యాత్ర‌కు ప్లాన్ చేశారు. తాజాగా షురూ అయిన ఈ యాత్ర‌లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌రాజు పాద‌యాత్ర కూడా చేయ‌నున్నారు. యూపీలోని 403 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలకు తాజా యాత్ర‌తో రాహుల్ దాదాపు సగం కంటే ఎక్కు నియోజ‌క‌వ‌ర్గాల్ని (223 ) క‌వ‌ర్ చేయ‌నున్నారు.

ఈ యాత్ర‌లో భాగంగా దేవ‌రియా జిల్లాలోని రుద్రాపూర్‌ లో యువ‌రాజు రైతుల‌తో బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఖాట్ స‌భ పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ స‌భ ప్ర‌త్యేకత‌ ఏమిటంటే.. స‌భ‌కు వ‌చ్చే రైతులు రిలాక్స్ గా కూర్చొని యువ‌రాజు చెప్పే మాట‌ల్ని వినేందుకు వీలుగా భారీ ఎత్తున మంచాల్ని ఏర్పాటు చేశారు. రైతులు సేద తీరుతూ రాహుల్ చెప్పే మాట‌లు వినేందుకు 2వేల‌కు పైగా మంచాలు వేయ‌టం విశేషం. మ‌రి.. ఈ ఏర్పాట్లు రైతుల్ని ఎంత‌మేర ఆక‌ర్షిస్తాయో చూడాలి. మంచాలు వేసిన నేప‌థ్యంలో.. యువ‌రాజు మాట‌లు జోల‌పాట‌లా మారి రైతుల కంటి మీద కునుకు వ‌స్తే ప‌రిస్థితేంది చెప్మా..?