Begin typing your search above and press return to search.

విరగబడి వచ్చినోళ్లంతా యువరాజు కోసం కాదట!

By:  Tupaki Desk   |   7 Oct 2016 4:18 AM GMT
విరగబడి వచ్చినోళ్లంతా యువరాజు కోసం కాదట!
X
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి వచ్చినంత కష్టం మరెవరికీ రాకూడదేమో. పార్టీ అధినేత్రి సోనియమ్మ తర్వాత స్థానం ఆయనదే. ఆ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. భవిష్యత్ ప్రధానిగా మొన్నటి వరకూ రాహుల్ ను అనుకున్నప్పటికీ.. ప్రధాని లాంటి కీలక పదవికి ఎలాంటి అర్హతలు ఉండాలన్న విషయంపై దేశ ప్రజలకు అవగాహన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలకు మాత్రం అర్థం కాని పరిస్థితి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆ విషయంపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తున్న పరిస్థితి.

రోజురోజుకీ తగ్గుతున్న తన ప్రభను రాహుల్ గాంధీ గుర్తించారో లేదో కానీ.. తాజాగా చోటుచేసుకున్న ఘటన మాత్రం రాహుల్ ను అంతర్మధనంలోకి వెళ్లేలా చేయటమే కాదు.. తనకున్న ఇమేజ్ గురించి ఆలోచించుకునేలా చేస్తుందనటంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా స్టార్ డమ్ రాజకీయ నేతలు ఎవరున్నారన్న జాబితా తయారు చేస్తే.. మొదటి ఐదు స్థానాల్లో రాహుల్ గాంధీ పేరు ఉంటుందనటంలో సందేహం లేదు.

మరి.. అలాంటి స్టార్ డమ్ ఉన్న నేత ఎక్కడికైనా వెళితే.. అక్కడి ప్రజలు ఎంతగా ఆదరించాలి? మరెంతగా అభిమానించాలి?కానీ.. అదేం చిత్రమో కానీ.. యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం నెలల ముందే కాలికి బలపం కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీకి రావాల్సినంత ప్రచారం రావటం లేదనే చెప్పాలి. సుదీర్ఘంగా సాగే ఆయన యూపీ పర్యటనకు జాతీయ మీడియాలో కూడా పెద్ద ప్రాధాన్యత దక్కని దుస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన మీరట్ లో కిసాన్ ర్యాలీ నిర్వహించారు. దీనికి జనం విపరీతంగా పోటెత్తారు. అయినా.. రాహుల్ గాంధీకి సంతోషం మాత్రం మిగల్లేదని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఈ ర్యాలీకి ఆయనతో పాటు.. యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి షీలా దీక్షిత్ తో పాటు.. సినీనటి.. కాంగ్రెస్ నేత నగ్మా హాజరయ్యారు. మీరట్ కు వచ్చిన రాహుల్ కంటే.. ఆయన వెంట వచ్చిన నగ్మాను చూసేందుకు ప్రజలు విరగబడటం.. ఆమె కోసం వారు పడిన తాపత్రయం యువరాజుకు ఇబ్బంది కలిగించాయనటంలో సందేహం లేదు. తన స్టార్ డమ్ మీద సందేహాలున్న ఆయనకు.. అందుకు తగ్గట్లే ప్రజలు సైతం రియాక్ట్ కావటానికి మించిన విషాదం మరింకేం ఉంటుంది చెప్పండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/