Begin typing your search above and press return to search.

కీలక పాదయాత్రకు ముందు రాహుల్, సోనియా విదేశీ పర్యటన

By:  Tupaki Desk   |   24 Aug 2022 9:30 AM GMT
కీలక పాదయాత్రకు ముందు రాహుల్, సోనియా విదేశీ పర్యటన
X
కేవలం 15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తన అతిపెద్ద ప్రజా చైతన్య కార్యక్రమం పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ చేపట్టిన భారత్ యాత్రను ప్రారంభించేముందర అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యాత్రను కాంగ్రెస్ కు స్నేహపూర్వక రాష్ట్రమైన తమిళనాడు నుండి ప్రారంభించాలని యోచించారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ మిత్రపక్షం కావడంతో అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యాత్ర కాశ్మీర్‌లో ముగుస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ వంటి ప్రాంతీయ పార్టీలు ఈ యాత్ర కోసం కాంగ్రెస్ కు మద్దతు పలికారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమయ్యే ఈ యాత్రలో ప్రధానంగా దేశంలో బీజేపీ ఎగదోస్తున్న మతతత్వం, ధరల పెరుగుదలపై దృష్టి సారిస్తుంది..

యాత్రకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఇద్దరూ విదేశీ పర్యటనకు బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది.. ఈ ఇద్దరు ఏ దేశానికి వెళుతున్నారన్నది మాత్రం వెల్లడి కాలేదు. అయితే సోనియా గాంధీకి ఆరోగ్య పరీక్షలు ఉంటాయని..

యాత్రలో మరింత చురుకైన పాత్ర పోషించాల్సి ఉంటుందని.. అందుకే చికిత్స కోసం విదేశాలకు వెళుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రాహుల్ గాంధీ పబ్లిక్ స్పీచ్.. తన పరపతి వ్యవహారశైలిని మెరుగుపరుచుకునేందుకు కొంత కోచింగ్ తీసుకోవడానికి విదేశాలకు టూర్ వేస్తున్నట్టు వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల సహాయాన్ని తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పాదయాత్రలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పాదయాత్ర పురోగతి, ప్రజల స్పందనపై ప్రతిరోజూ సమీక్షలు ఉంటాయి.

కాంగ్రెస్ వర్గాలు కోరితే సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ కూడా యాత్రలో భాగంగా నిర్వహించే కీలక ర్యాలీలలో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ దేహి నుండి యాత్ర పురోగతిని పర్యవేక్షిస్తారు. భారత్ జోడో యాత్రలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.