Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌తిప‌క్షానికి ఆయ‌నొక్క‌డే పెద్ద దిక్కు

By:  Tupaki Desk   |   31 Dec 2017 10:47 AM GMT
ఏపీ ప్ర‌తిప‌క్షానికి ఆయ‌నొక్క‌డే పెద్ద దిక్కు
X
ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి గురించి ఇటు సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌తో పాటు విప‌క్ష నేత‌లు సైతం ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. త‌న పార్టీ రోజురోజుకూ క్షీణిస్తున్నా, భ‌విష్య‌త్తుపై ఆశ‌ల‌తో విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్తున్నారు. ప‌లు అంశాల‌పై త‌న ప‌రిధి మేర‌కు పోరాడుతున్న రఘువీరా తాజాగా కొత్త ఎజెండాతో ముందుకు వ‌చ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఆయ‌న పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ ద‌ఫా పార్టీ జాతీయ నేత‌ల‌ను కూడా ర‌ఘువీరా రెడ్డి ఎంట్రీ చేయిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల 7 నుంచి మహా పాదయాత్ర చేపడుతున్నట్లు ర‌ఘువీరారెడ్డి తెలిపారు. ఈ యాత్ర ధవళేశ్వరం వద్ద పాండిచ్చేరి సిఎం నారాయణ స్వామి ప్రారంభిస్తారని వెల్ల‌డించారు. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు ఈ యాత్ర సాగుతుందన్నారు. జనవరి 7 - 8 - 9 తేదీల్లో మహా పాదయాత్ర, 10న పోలవరంలో సత్యాగ్రహం నిర్వహిస్తామన్నారు. ముగింపు కార్యక్రమానికి లోక్‌ సభ కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి రైతులు భాగస్వాములవుతారని చెప్పారు. విభజన హామీ చట్టం మేరకు కేంద్రమే పోలవరం ప్రాజెక్టును నిర్మించాలన్నారు. నిర్వాసితులెవరూ కంటతడి పెట్టకుండా న్యాయం చేయాలని కోరారు.

సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి వల్లే పోల‌వ‌రం ప్రాజెక్టుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయ‌ని ర‌ఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ, తెలంగాణా సీఎం కేసీఆర్‌ తో చంద్రబాబు రాజీపడటం వల్లే ఆంధ్రప్రదేశ్‌ కు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. త‌న ఒప్పందాల వ‌ల్ల చంద్ర‌బాబు రాష్ట్రం కోసం గ‌ళం విప్ప‌డం లేద‌ని...త‌ద్వారా అది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు గొడ్డ‌లిపెట్టులాగా మారింద‌ని ర‌ఘువీరా రెడ్డి మండిప‌డ్డారు. అందుకే తాము ఏపీ కోసం కొత్త ఎజెండాతో ముందుకు సాగుతున్న‌ట్లు వెల్ల‌డించారు