Begin typing your search above and press return to search.

ప్ర‌తిపక్ష పార్టీని ఆయ‌న వ‌దిలేది లేద‌ట‌

By:  Tupaki Desk   |   15 April 2017 10:56 AM IST
ప్ర‌తిపక్ష పార్టీని ఆయ‌న వ‌దిలేది లేద‌ట‌
X
పార్టీలోని సీనియ‌ర్లు ఎందరో త‌మ సొంత దారి చూసుకుంటున్న‌ప్ప‌టికీ ఏపీ కాంగ్రెస్‌ కు ఒక గుర్తింపు తెచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి త‌నదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అత‌డే ఒక సైన్యం లాగా ఆయ‌న త‌న పోరాట పంథాను కొన‌సాగిస్తున్నారు. అయితే కొద్దికాలంగా ర‌ఘువీరా పార్టీ మార‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై ర‌ఘువీరా క్లారిటీ ఇచ్చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లా మడకశిరలో ర‌ఘువీరారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, గత ఐదు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తులు తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. టీడీపీ-వైసీపీకి చెందిన కొందరు నాయకులు ఉద్దేశ పూర్వకంగా తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేసి తన వర్గీయులను దెబ్బతీయాలని చూస్తున్నారని ర‌ఘువీరా అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రా నుండి కర్నాటక ప్రాంతానికి వెళ్తున్నట్లు ప్రచారం చేశారని గుర్తు చేశారు. అందుకే వైసీపీలోకి మారుతున్నట్లు వస్తున్న పిచ్చిమాటలను నమ్మొద్దని ర‌ఘువీరారెడ్డి అన్నారు. చివరి వరకు తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. రాజకీయం అంటే సమాజానికి సేవ చేయడం తప్ప పార్టీలు మారడం కాదని ఆయ‌న తెలిపారు.

గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా కొనసాగుతున్నానని ర‌ఘువీరారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ తరఫున ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యానని, మంత్రి పదవులు అనుభవించానన్నారు. బలహీనంగా ఉన్న వారు పదవుల కోసం పార్టీలు మారతారని, తాను ఆ టైప్ కాద‌ని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేంత వరకు కాంగ్రెస్‌ లో ఉంటామని వైఎస్ హయాంలో ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేశామని, అయితే కొంతమంది నేతలు దాన్ని మరచి పార్టీలు మారారని ర‌ఘువీరా రెడ్డి విమ‌ర్శించారు. స‌ద‌రు నాయ‌కులు అలా ఎందుకు ప్రవర్తించారో అర్థం కాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏమాత్రం తక్కువ చేయలేదని, తాను అదే పార్టీలో కొనసాగుతానని ర‌ఘువీరారెడ్డి తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/