Begin typing your search above and press return to search.

అందరి వైఎస్ ను కొందరికే చేస్తావేం రఘువీరా?

By:  Tupaki Desk   |   3 Sept 2016 10:06 AM IST
అందరి వైఎస్ ను కొందరికే చేస్తావేం రఘువీరా?
X
కొన్ని సందర్భాల్లో ఒకరిని పొగడటం మరొకరిని తిట్టటంలా మారుతుంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి మాటలు ఇంచుమించు ఇదే తీరులో ఉన్నాయి. దివంగత వైఎస్ కు అత్యంత సన్నిహితులైన నేతల్లో ఒకరైన రఘువీరా.. వైఎస్ వర్థంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ కానీ బతికి ఉంటే ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయేది కాదన్న వ్యాఖ్య చేశారు. స్వార్థపరులు.. బలహీనమైన నాయకుల వల్లనే రాష్ట్రం రెండుగా విడిపోయిందని వ్యాఖ్యానించారు.

రఘువీరా చేసిన తాజా వ్యాఖ్య వైఎస్ ను పొగడటం తర్వాత.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తప్పుపట్టినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బలహీన మైన నాయకుల వల్లే విభజన జరిగినట్లుగా చెబుతున్న రఘువీరా.. వైఎస్ తప్ప పార్టీలో మరెవరూ బలమైన నేతలు కాదన్న వాదనను స్పష్టం చేయటంతో పాటు.. విభజన నిర్ణయాన్ని తీసుకున్న పార్టీ అధినేత్రిని తక్కువగా చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో తామిచ్చిన హామీ మేరకు విభజన నిర్ణయాన్ని తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే క్రమంలో.. విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీకి దక్కే మైలేజీని తగ్గించేలా రఘువీరా మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ ను కీర్తించాలంటే మరోలా కీర్తించాలే కానీ.. విభజన అంశాన్ని తెరపైకి తీసుకురావటం సరికాదని చెబుతున్నారు. రఘువీరా నోటి నుంచి వచ్చిన వైఎస్ – విభజన మాటల కారణంగా అందరివాడిగా ఉండే వైఎస్.. కొందరి వాడిగా మార్చే ప్రయత్నం జరిగిందన్న విమర్శ వ్యక్తమవుతోంది. విభజనకు వైఎస్ వ్యతిరేకి అన్న భావనతో పాటు.. తెలంగాణ ప్రజల మనసుల్లో వైఎస్ ను మరింత దూరం చేసేలా రఘువీరా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పొచ్చు. వైఎస్ వర్థంతి సందర్భంగా రఘువీరా వ్యాఖ్యలు వైఎస్ స్థాయిని కుంచించిపోయేలా చేయటంతో పాటు.. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాట్లాడే నాలుగు ముక్కలు కాస్త ప్రిపేర్ అయితే ఇలాంటి లొల్లి ఉండదు కదా..?