Begin typing your search above and press return to search.

విభజన అప్పుడు ఏమయ్యావ్ రఘువీరా?

By:  Tupaki Desk   |   17 July 2016 10:05 AM IST
విభజన అప్పుడు ఏమయ్యావ్ రఘువీరా?
X
ఘోరమైన తప్పు చేసే వ్యక్తికి నీతులు చెప్పే అవకాశం ఉంటుందా? ఏపీకి ఎంత ద్రోహం చేయాలో అంతా చేసేసిన వ్యక్తి.. ఇప్పుడు ఎవరో ఏదో చేయాలని అనుకోవటంలో అర్థం లేదు. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరాకు అర్థమైనట్లు లేదు. ఈ రోజున ఏపీ ఎదుర్కొంటున్నఅన్ని సమస్యలకు.. చోటు చేసుకుంటున్న అనర్దాలకు కాంగ్రెస్ కారణమన్న విషయాన్ని మర్చిపోకూడదు. చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఏపీ పీక నొక్కేసిన తమ పార్టీ అధినాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించలేని సత్తా లేని రఘువీరా లాంటి వారు ఇప్పుడు మాత్రం బోలెడన్ని కబుర్లు చెబుతున్నారు.

ఏపీ మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యవహరించాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని చెబుతున్న రఘువీరా.. హోదా కోసం అందరూ కృషి చేయాలని చెప్పటం శోచనీయం. ఎందుకంటే.. ప్రత్యేకహోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చకపోవటం ద్వారా కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇదే అంశం చట్టంలో ఉండి.. దానికి కాలపరిమితి స్పష్టంగా పెట్టి ఉంటే..ఈ రోజు ఈ సమస్య వచ్చేది కాదు.

విభజన నాటి ముచ్చట వదిలేసి.. ఇప్పటికైనా కాంగ్రెస్ ఏమైనా చేసిందా? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం లేదనే వస్తుంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని సోనియా.. రాహుల్ స్వయంగా పార్లమెంటులో ప్రస్తావించి.. సభను స్తంభింపచేయగలిగితే మోడీ అండ్ కో మాట వినకుండా ఉంటారా? మాజీ ప్రధాని మన్మోహన్ లాంటి నేత ఢిల్లీలో నిరసనకు దిగితే ఫలితం రాకుండా ఉంటుందా? మొండితనంతో మోడీ వ్యవహరిస్తున్న వేళ.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వాన్ని నిలదీసి.. ఏపీ గురించి ఎందుకు పట్టించుకోరంటూ తెలుగు మీడియా ముందు మాటలు చెప్పే రఘువీరా అండ్ కోకు దమ్ముందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబితే బాగుంటుంది. తాను చేయాల్సిన పని గురించి కాకుండా.. ఎదుటి వారు చేయాల్సిన పని గురించి మాట్లాడటాన్ని రఘువీరా వదిలేస్తే బాగుంటుంది. కానీ.. అలాంటిదే ఉంటే ఏపీకి ఈ రోజు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా..?